అడుగడుగునా నీరా‘జనం’ | - | Sakshi
Sakshi News home page

అడుగడుగునా నీరా‘జనం’

Oct 19 2026 2:13 AM | Updated on Oct 19 2026 2:13 AM

సాంగ్వి నుంచి అడెల్లికి చేరుకున్న పోచమ్మ ఆభరణాలు అశేష భక్తజనం మధ్య శోభాయాత్ర భక్తజన సంద్రమైన దిలావర్‌పూర్‌, సారంగాపూర్‌ ముగిసిన గంగనీళ్ల జాతర

దిలావర్‌పూర్‌/సారంగాపూర్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రముఖ పండుగల్లో గంగనీళ్ల జాతర ఒకటి. నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం అడెల్లి శ్రీమహా పోచమ్మ ఆభరణాలను గోదావరి నదికి తీసుకెళ్లి.. శుద్ధి చేసి తిరిగి తీసుకువచ్చి అలంకరించే వేడుక ఈ జాతర. శనివారం అమ్మవారి ఆభరణాలను గోదావరి తీరానికి తరలించారు. ఆదివారం శుద్ధి చేసిన అనంతరం అడెల్లికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జరిగిన శోభాయాత్రలో అడుగడుగునా జనం అమ్మవారి ఆభరణాలకు హారతులు పట్టారు. ఆభరణాలను అమ్మవారికి అలంకరించిన తర్వాత జాతర ముగిసింది.

తెల్లవారుజామున శుద్ధి..

శనివారం దిలావర్‌పూర్‌ మండలం సాంగ్వికి పోచమ్మ ఆభరణాలు చేరుకున్నాయి. అక్కడే పోచమ్మ ఆలయంలో జాగరణ చేసిన భక్తులు.. ఆదివారం తెల్లవారుజామున గంగానీకు శరణమే..ం ఘనమైన పూజలేం ఉయ్యాలో.. ఊరూవాడ జంపాలోం.. పోచమ్మ తల్లీ సల్లంగ సూడమ్మోం అంటూ ఆటపాటలతో ఆభరణాలను గోదావరి తీరానికి తరలించారు. అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారి నగలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గడముంతల్లో గోదావరి జలాలతో గంగనీళ్ల జాతరకు వచ్చిన భక్తులు అమ్మవారి ఆభరణాల వెంట తరలారు.

అడెల్లి ఆలయంలో జాతర

అడెల్లి మహాపోచమ్మ గంగనీళ్ల జాతర ఆదివారం అత్యంత వైభవోపేతంగా సాగింది. ఉదయం 5 గంటల నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాలతో పాటు నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌, పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. తిరిగి ఆలయానికి చేర్చిన ఆభరణాలను రాత్రి అమ్మవారికి అలంకరించడంతో జాతర ముగిసింది.

అడుగడుగునా హారతులు..

ఆభరణాలు తరలివచ్చిన ప్రతీ గ్రామంలో భక్తులు అడుగడుగునా హారతులు పట్టి, మోసుకెళ్లే వారి కాళ్లు కడిగి, కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి ప్రణమిళ్లారు. ఆయా గ్రామాల గంగపుత్రులు సంప్రదాయ వలలతో గొడుగులు పట్టి గ్రామ పొలిమేరల వరకు సాగనంపారు. సాంగ్విలో స్థానిక ఎస్సై శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో 250 మంది ప్రత్యేక, స్థానిక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసి ఆభరణాలను నిర్ణీత సమయానికి అడెల్లి ఆలయానికి చేరవేశారు.

ప్రముఖుల దర్శనం

మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబీకులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో భూమయ్య, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి మర్యాదలు చేశారు. నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకోగా పూర్ణకుంభంతో స్వాగతం పలికి సత్కరించారు. జాతరను విజయవంతం చేసిన పోలీసు, ఆర్టీసీ, వైద్యసిబ్బంది, ఆలయ అధికారులు, స్థానిక నాయకులు, వాలంటీర్లు, భక్తులకు ఆలయం తరపున ఈవో భూమయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ శాఖ అధికారులను ఆలయ మర్యాదలతో సత్కరించారు.

ఉప్పొంగిన భక్తిభావం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement