లక్ష్మణచాంద: సోన్ మండలం కడ్తాల్లో ఆదివారం గంగనీళ్ల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం దేగాంకు చెందిన పోచమ్మ తల్లి ఆభరణాలకు శనివారం సాయంత్రం కడ్తాల్ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం తెల్లవారుజామున సోన్ మండలం గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారి ఆభరణాలను శుద్ధి చేశారు. అనంతరం ఆభరణాలు, గంగజలాలతో పాదయాత్రగా గ్రామానికి తీసుకువచ్చారు. మహిళలు మంగళహారతులు బాజాభజంత్రీలతో గ్రామ ప్రధాన వీధుల గుండా ఆభరణాల ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా పోచమ్మ తల్లిని వేడుకున్నారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీడీసీ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం రాము, వీడీసీ చైర్మన్ గుర్రం గంగన్న తదితరులు పాల్గొన్నారు.


