గతేడాది చీరల పంపిణీ పూర్తి కాలేదు
ఈ ఏడాది ఇంకా చేరనే లేదు
పండుగ వస్తున్నా ఊసే లేదు
మంచిర్యాలటౌన్: జిల్లాలో గతేడాది బతుకమ్మ చీరలను ఇప్పటికీ పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు. ఈ ఏడాది ఏడాది బతుకమ్మ పండుగ సమీపించినా చీరలు రాకపోవడంతో పంపిణీపై సందిగ్ధత నెలకొంది. మెప్మాలోని మహిళా సంఘాల సభ్యులకు కొత్తగా చేరే మహిళల కోసమని గతేడాది బతుకమ్మ పండుగకు చీరలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినా పండుగకు ఇవ్వలేక పోయింది. ఆలస్యంగానైనా ఈ ఏడాది జనవరిలో అన్ని మున్సిపాలిటీలు, మంచిర్యాల కార్పొరేషన్‌కు 57వేల చీరలు పంపించింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని పంపిణీ ఆలస్యం చేశారు. మే నెలలో పంపిణీ చేసినా మూడో వంతు చీరలను పంపిణీ చేయకుండా మహిళా సంఘాల ఆర్పీల వద్దనే ఉంచారు. మంచిర్యాల నగరంలోనే 3 వేలకు పైగా చీరల పంపిణీ చేపట్టకపోగా, మిగతా మున్సిపాలిటీల్లోనూ ప్రతి ఆర్పీ వద్ద కొన్ని చీరలు మిగిలిపోయి ఉన్నాయి.
ఈ ఏడాది ఇంకా రాలే..
తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత గల పండుగల్లో బతుకమ్మ ఒకటి. గత ప్రభుత్వం బతుకమ్మ పండుగ కోసం 18ఏళ్లు నిండి, తెల్ల రేషన్‌కార్డు ఉన్న యువతులు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం కొనసాగించింది. గతేడాది(2025)లో బతుకమ్మ చీరలను ముందుగా మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారికి ఇచ్చి, ఆ తర్వాత 18ఏళ్లు నిండిన యువతులు, మహిళలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంపిణీలో మహిళా సంఘాల సభ్యులతోపాటు కొత్తగా సంఘాల్లో చేరే వారి కోసం గతేడాది జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు మందమర్రి, బెల్లంపల్లి, క్యాతన్‌పల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లోని మెప్మా మహిళా సభ్యులకు 57వేల చీరలు సరఫరా చేశారు. వాటిని వంద శాతం పంపిణీ చేయకపోవడంతో ఇప్పటికీ కొన్ని మహిళా సంఘాల ఆర్పీల వద్దనే ఉండిపోయాయి. ఈ ఏడాది బతుకమ్మ పండుగకు మరో మూడు రోజులే ఉండగా, నేటికీ చీరలు మున్సిపాలిటీలకు చేరుకోకపోవడంతో ఈసారి పండుగకు మహిళలకు చీరల పంపిణీ లేనట్లే.


