నెన్నెల: పంటలకు నీటితడులు అందించాల్సిన వేళ కరెంటు కోతలు కర్షకుడి కొంప ముంచుతున్నాయి. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతుంటే ఆశలు ఆవిరవుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవక.. మరో వైపు విద్యుత్ కోతలతో పంటలకు నీటితడులు అందక వరి, పత్తి చేలు వాడిపోతున్నాయి. అప్పులు చేసి పెట్టుబడి పెడితే కళ్లముందే కళ తప్పుతుండడంతో రైతన్న గుండె చెరువవుతోంది. పంట చేతికొచ్చే దశలో ఎండిపోతుంటే చేసిన అప్పులు ఎలా తీర్చాలని కన్నీటి పర్యంతం అవుతున్నారు. బోర్ల కింద వేసిన వరి పొలాలు అప్రకటిత విద్యుత్ కోతలతో నెర్రెలు బారుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. అధికారులు నాణ్యమైన త్రీఫేజ్ విద్యుత్ను నిరంతరాయంగా సరఫరా చేసి పంటలను కాపాడాలని వేడుకుంటున్నారు.


