జిల్లాలో ఇక ఏవియేషన్ అకాడమీలు రెండు ప్రైవేట్, ఆరు ఎంఆర్‌వో కేంద్రాలు కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు ఐఏఎఫ్ ట్రైనింగ్ ఏర్పాటు నేపథ్యంలో..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్టుతో పాటు ఇండియన్ ఎయిర్‌పోర్స్‌కు చెందిన శిక్షణ కేంద్రం ఏర్పాటు కానున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీలు కూడా ఈ ప్రాంతంపై దృష్టి సారించాయి. ప్రైవేట్ పైలట్ శిక్షణ సంస్థలు రెండు ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నాయి. అలాగే ఆరు ఎంఆర్‌ఓ (నిర్వహణ), రిపేర్(మరమ్మతు), ఓవర్‌హాల్ (సమగ్ర తనిఖీ) కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఈ దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర రక్షణ శాఖకు దరఖాస్తు చేసుకున్నాయి.
– సాక్షి, ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఆధ్వర్యంలో సివిల్ ఏవియేషన్ ఎన్‌క్లేవ్ ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనుండగా, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్) ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రంతోపాటు ఎంఆర్‌వో ఇతరత్రా సదుపాయాలతో ఏర్పాటు కానుంది. ఇందుకోసం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 2009 ఎకరాల భూసేకరణకు రూ.2278 కోట్లు మంజూరు చేస్తూ ఈ నెల 25న జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. భూసేకరణ, ప్రతి పాదిత ప్రాజెక్ట్ నిర్మాణంలో అడ్డంకులు తొలగించేందుకు వివిధ పనుల కోసం నిధులు వెచ్చిస్తారు.
ప్రైవేట్ అకాడమీల దృష్టి..
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టుతో పాటు వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుండగా ఇక్కడ ప్రైవేట్ అకాడమీలు కూడా శిక్షణకు ముందుకు వస్తున్నాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వివిధ ప్రైవేట్ అకాడమీలను సంప్రదించగా వారు ఈ ప్రాంతంలో ఏర్పాటుకు ఆసక్తి కనబర్చుతూ తమ దరఖాస్తులు అందజేశారు. తాజాగా ఎమ్మెల్యే ద్వారా వాటిని కేంద్ర రక్షణ శాఖకు అందజేశారు.
అకాడమీలు ఇలా..
పైలట్ శిక్షణ ఆసక్తి కనబర్చే వారికి విమానం నడపడం నేర్పిస్తారు. దాంతో పాటు పైలట్ లైసెన్సులు, రేటింగ్‌ల కోసం శిక్షణ ఇవ్వడానికి విమానయాన అధికార సంస్థ (డీజీసీఏ, ఈఏఎస్‌ఏ) నుంచి అధికారిక ఆమోదం పొంది ఉండాలి. అలాంటి సంస్థలే శిక్షణ ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది.


