మంచిర్యాలఅర్బన్: జిల్లాలో బోనాల సందడి కొనసాగుతోంది. ఆషాఢ మాసం నెల రోజులపాటు డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు, కళాకారులు ఆటపాటలు, డీజే హోరు వాడవాడలా మార్మోగుతుంది. బోనాల జాతర సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడమే కాకుండా చిన్న తరహా వ్యాపారులు, కళాకారులు, చేతివృత్తుల కుటుంబాలకు నెల రోజులపాటు ఆశాజనకమైన ఆదాయం అందిస్తోంది. ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా జాతర అనేక రకాల వృత్తుల వారికి ఆర్థికంగా ఊరటనిస్తూ వ్యాపార రంగానికి సరికొత్త వెలుగునిస్తోంది.
ఆఫర్ల ధమాకా
ఆషాఢ మాసంలో బట్టల వ్యాపారం జోరుగా సాగుతోంది. సాధారణంగా ఈ మాసంలో శుభకార్యాలు లేక వ్యాపారాలు మందగిస్తాయి. ఇందుకు భిన్నంగా ప్రముఖ షాపింగ్ మాల్స్, వస్త్ర వ్యాపారులు ఆ షాఢం ఆఫర్ల విక్రయాలతో మార్కెట్ కిటకిటలాడుతోంది. ఒకటి కొంటే ఒకటి ఉచితం, 50నుంచి 80 శాతం రాయితీ ఇస్తుండడంతో జనం విపరీతంగా ఆసక్తి చూపుతున్నారు. బోనాల పండుగ, రాబోయే శ్రావణ మాస పూజలు, పేరంటాల కోసం మహిళలు ఇప్పటి నుంచే కొనుగోలు చేస్తున్నారు.
దారిపోచమ్మకు మొక్కులు..
బస్తీల్లో పోచమ్మ తల్లి ఉత్సవాల నేపథ్యంలో మేకలు, కోళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆపదలు తొలగి ఊరంతా ఆయురారోగ్యాలతో సల్లంగా ఉండేలా చూడు పోచమ్మ తల్లి అంటూ ప్రార్థిస్తూ వివిధ బస్తీల్లో భక్తులు, ప్రమాదాల నివారణకు రహదారి వెంట వెలిసిన దారి పోచమ్మకు వాహనదారులు కోళ్లు, మేకలతో మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో మేకలు, కోళ్ల వ్యాపారం జోరుగా సాగుతోందని వ్యాపారులు తెలిపారు.


