అనుమతి..‘దారేది’! | - | Sakshi
Sakshi News home page

అనుమతి..‘దారేది’!

Jul 29 2026 1:04 AM | Updated on Jul 29 2026 1:04 AM

● కోటపల్లి మండలంలోని పదికి పైగా గ్రామాలు రోడ్ల నిర్మాణాలకు నోచుకోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ● మల్లంపేట నుంచి నీల్వాయి వరకు 30ఏళ్ల క్రితం నిర్మించిన బీటీ రోడ్డు శిథిలావస్థకు చేరింది. కొత్త రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ క్లియరెన్స్‌ లభించకపోవడంతో నిలిచిపోయింది. ● మల్లంపేట నుంచి నక్కలపల్లి, పారుపల్లి నుంచి రాజారాం కొత్తపల్లి, వేమనపల్లి నాగారం, నక్కలపల్లి నుంచి చామన్‌పల్లి, బొమ్మెన, మల్లంపేట నుంచి బొప్పారం గ్రామాలకు రోడ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. ● భీమారం నుంచి చెన్నూర్‌ వచ్చే రహదారిలో జోడువాగుల వద్ద ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ లభించక పనులు నిలిచిపోయాయి. గ్రామీణ సడక్‌ యోజన పథకం ద్వారా రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనా ఫలితం లేకుండా పోతోంది.

గ్రామీణ రోడ్లకు శాపంగా ఫారెస్ట్‌ కన్జర్వేషన్‌ చట్టం నిధులు మంజూరైనా.. అనుమతులు శూన్యం నిలిచిపోతున్న నిర్మాణాలు బాహ్య ప్రపంచానికి ప్రజలు దూరం

చెన్నూర్‌: స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు కావస్తున్నా నేటికీ రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయంటే నమ్మశక్యం కాదు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు అనుసంధాన రోడ్లు లేక ఆయా గ్రామాల ప్రజలు దుర్భర జీవనం సాగిస్తున్నారు. 1980లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ఫారెస్ట్‌ కన్జర్వేషన్‌ చట్టం గ్రామీణ రోడ్లకు శాపంగా మారింది. ఈ చట్టంలో పొందుపర్చిన పర్యావరణ అనుమతులు రోడ్ల నిర్మాణాలకు గుదిబండగా మారాయి. ఈ చట్టం ఏర్పాటుకు ముందే నిర్మించిన రోడ్లు తప్ప నేటికీ కొత్త దారుల నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. కొన్ని రోడ్లకు నిధులు మంజూరైనా అటవీశాఖ అనుమతి లభించక నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో మెరుగైన వైద్యం, విద్య సౌకర్యాలు అందక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వర్షాకాలంలో అవస్థలు వర్ణణాతీతం.

ముందుకు సాగని నిర్మాణాలు...

మల్లంపేట నుంచి నక్కలపల్లి వరకు బీటీ రోడ్డు లేక అవస్థలు పడుతున్నాం. నక్కలపల్లి వెళ్లే దారిలో రోడ్డు డ్యాం లేక వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ చట్టాన్ని సవరించే విధంగా ఎంపీలు కృషి చేయాలి. గ్రామీణ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలి.

– తొట అశోక్‌, నక్కలపల్లి

మినహాయింపు ఇవ్వాలి..

గ్రామీణ రోడ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వాటా చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించలేని పరిస్థితి ఉంది. పార్లమెంటు సభ్యులు సమావేశాల్లో ఈ క్లాజును సవరించి గ్రామీణ రోడ్లకు మినహాయింపు ఇవ్వాలి. మెరుగైన రోడ్డు, విద్య, వైద్య సౌకర్యాలు మెరుగు పర్చాలి.

–పోటు రాంరెడ్డి, మాజీ జెడ్పీటీసీ, కోటపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement