● ఏళ్ల తరబడి ఒకే రకం పంటల సాగు చేటు ● మార్పుతోనే మంచి దిగుబడి | - | Sakshi
Sakshi News home page

● ఏళ్ల తరబడి ఒకే రకం పంటల సాగు చేటు ● మార్పుతోనే మంచి దిగుబడి

Jun 8 2026 11:42 PM | Updated on Jun 8 2026 11:42 PM

● ఏళ్ల తరబడి ఒకే రకం పంటల సాగు చేటు ● మార్పుతోనే మంచి దిగుబడి

శనగ పంట వరుసగా వేసుకుంటే కాయతొలుచు పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ పురుగుల దాడి తక్కువగా ఉండే జొన్న, నువ్వులు, ఉలవ, మెట్ట వరి పంటలు వేసుకోవచ్చు.

కంది, శనగ పంటలతో పోలిస్తే మినుము, సోయాచిక్కుడు పంటలకు కాయతొలుచు పురుగుల తాకిడి తక్కువగా ఉంటుంది. వీటితో కూడా పంట మార్పిడి చేయొచ్చు.

వరుసగా పొద్దుతిరుగుడు పంట వేసుకునే వారు దాని స్థానంలో కొర్ర, జొన్న, సజ్జ వంటి చిరుధాన్యం పంటలు వేసుకోవాలి. దీనివల్ల నులిపురుగు తాకిడి తగ్గుతుంది.

అనుప, కాకర, దోస, కర్బూజ, గుమ్మడి, పొ ట్ల, బీర, బూడిద గుమ్మడి, దొండ వంటి తీగజాతి కూరగాయల పంటలు సాగు చేసిన వా రు వరితో పంట మార్పిడి చేసుకోవాలి.

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ఖరీఫ్‌ సాగు సీజన్‌ మొదలైంది. కొద్ది రోజుల్లో రుతుపవనాలు జిల్లాను తాకనున్నాయని, సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. పంట మార్పిడి చేపట్టాలని రైతు సంక్షేమ కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీంతో పంట మార్పిడిపై జిల్లా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒకే రకమైన పంటను ఏళ్ల తరబడి సాగు చేయడం వల్ల దిగుబడి రాక అనేక సమస్యలు ఎదురవుతాయని, చీడపీడల బెడద అధికం కావడంతోపాటు భూమి సారం కోల్పోతుందని, పంట మార్పిడితో ప్రయోజనం పొందవచ్చని ఆదిలాబాద్‌ వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీధర్‌ చౌహాన్‌ వివరించారు. ఆయన సూచనలు, సలహాలు..

పత్తి, వరి పంటలే అధికం..

జిల్లాలో అన్ని రకాల పంటల సాగుకు నేలలు అనుకూలంగా ఉన్నా రైతులు దాదాపు 15ఏళ్ల నుంచి పత్తి, వరి పంటలే సాగు చేస్తున్నారు. చీడపీడల ఉధృతి పెరగడంతో విపరీతంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు. దీంతో భూమి సారవంతం కోల్పోయి పంట ఎదుగుదల క్షీణించి దిగుబడి తగ్గి నష్టపోతున్నారు. వానాకాలంలో 70శాతం మంది రైతులు వర్షాధారంగా ఈ రెండు పంటలే సాగు చేస్తున్నారు. కొందరు అటవీ జంతువుల బెడద ఉంటుందని, మార్కెట్‌, నీటి సౌకర్యం లేదని, వేరే పంటలు దిగుబడి రావని తదితర కారణాలతో ఇతర పంటల వైపు మొగ్గు చూపడం లేదు.

భిన్నమైనవి ఎంచుకోవాలి

పంట మార్పిడి చేయాలంటే అంతకుముందు వేసిన పంటకు భిన్నంగా పెరిగే పంటను ఎంచుకోవాలి. నువ్వులు, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న పంటల వేరు వ్యవస్థలు భూమి నుంచి పోషకాలు ఎక్కువగా గ్రహిస్తాయి. పంట మార్పిడి చేసే రైతులు భూమి నుంచి పోషకాలను గ్రహించే ఈ పంటలకు బదులుగా భూమికే పోషకాలు అందించే అపరాల పంటలు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇవి కొంతవరకు బెట్ట పరిస్థితులను కూడా తట్టుకుంటాయి. ఆకులను రాల్చి భూమికి సేంద్రియ పదార్థాలను అందిస్తాయి. వేరుబుడిపెలు నత్రజనిని స్థిరీకరిస్తాయి. నల్లరేగడి నేలల్లో నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు పండించిన రైతులు సోయాచిక్కుడు వేసుకుంటే మంచిది. ఈ పంట సమయానికి ఆకులు పూర్తిగా రాలిపోతాయి. తద్వారా ఎకరానికి ఒకటి నుంచి రెండు టన్నుల సేంద్రియ పదార్థం లభిస్తుంది.

చీడపీడల నివారణ కోసం..

కొన్ని రకాల పురుగులు, తెగుళ్లు కొన్ని పంటలను అధికంగా ఆశించి వృద్ధి చెందుతాయి. అలాంటి పంటలను వరుసగా వేసుకోకుండా మార్పిడి చేసుకోవాలి. వరుసగా పత్తి, వరి పంట వేయకుండా పప్పుధాన్యపు పంటలు, నూనెగింజల పంటలు వేసుకోవాలి. మిరుప, వేరుశనగ, క్యాబేజీ పంటలను లద్దె పురుగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తాయి. వీటి ఉధృతిని అరికట్టేందుకు జొన్న, వరి, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలతో మార్పిడి చేయాలి. దీనివల్ల ఆయా పంటల్లో కాళహస్తి తెగులు, నులి పురుగులు, ఆకుముడత, లద్దె పురుగుల ఉధృతిని నివారించవచ్చు.

వేయకూడని పంటలు..

బెండ తర్వాత పత్తి వేస్తే ఉపయోగం ఉండదు. ఈ రెండు పంటలను ఒకే రకమైన చీడపీడలు ఆశించి నష్టపరుస్తాయి. జొన్న వేసిన భూమిలో మిరప, పసుపు తర్వాత మిరప, టమాటా, ఆవాలు, బెండ వేయకూడదు. ఆకుముడత పురుగుల బెడద ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వేరుశనగ, సోయాచిక్కుడు పంటలు సాగు చేయొద్దు.

ఏవి వేసుకోవాలి..

గత రబీలో వేరుశనగ వేసిన రైతులు ఈ ఖరీఫ్‌లో మొక్కజొన్న పంట వేసుకుంటే పంటకు నత్రజని లభిస్తుంది. ఫలితంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. దీనివల్ల రాబోయే రబీలో మళ్లీ వేరుశనగ వేసినప్పుడు ఆ పంట నులి పురుగుల బెడద చాలా వరకు తగ్గుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement