ఇక బ్యాంకుల్లోనే పింఛన్లు | - | Sakshi
Sakshi News home page

ఇక బ్యాంకుల్లోనే పింఛన్లు

Jun 8 2026 11:42 PM | Updated on Jun 8 2026 11:42 PM

● చెల్లింపులకు సన్నాహాలు ● తీరనున్న ఇబ్బందులు

దండేపల్లి: చేయూత పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొస్తోంది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసు ద్వారా అందిస్తుండగా ఇక నుంచి బ్యాంకుల ద్వారానే చెల్లించేందుకు సన్నాహాలు చేస్తోంది. సంబంధిత అధికారులకు దిశానిర్ధేశం చేసినట్లు తెలిసింది. చేయూత పథకం ద్వారా వృద్ధాప్య, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 58,254 మంది పోస్టాఫీసు ద్వారా పింఛన్లు పొందుతున్నారు. ఇకపై బ్యాంకుల ద్వారా చెల్లింపులకు చర్యలు చేపడుతుండడంతో ఖాతాలు లేని వారు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బ్యాంకు ద్వారా ఏ విధంగా అందజేస్తారనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఏటీఎం కార్డులు జారీ చేస్తారా లేక ప్రత్యేక రోజులు కేటాయించి బ్యాంకు సిబ్బంది ద్వారా పంపిణీ చేయిస్తారా అనే విషయాలపై అధికారికంగా ఆదేశాలు వెలువడాల్సి ఉంది.

పోస్టల్‌ విధానంలో ఇబ్బందులు..

పోస్టాఫీసు ద్వారా పింఛన్ల పంపిణీలో కొన్ని చోట్ల కొందరు పింఛన్‌దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గ్రామాల్లో పోస్టల్‌ సేవలు అందుబాటులో ఉన్నా పంపిణీ సమయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ గుర్తింపు, బయోమెట్రిక్‌ ధ్రువీకరణ సమయంలో సరిగా నమోదు కాకపోవడంతో వృద్ధులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. రూ.2016, రూ.4016 పింఛన్ల మొత్తంలో చిల్లర రూ.16 చెల్లించడం లేదనే ఆరోణపణలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. ఇక ముఖ గుర్తింపు, బయోమెట్రిక్‌ రాని వారికి పంచాయతీ కార్యదర్శి వేలిముద్రలతో చెల్లిస్తుండడంతో తపాలా కార్యాలయాల చుట్టూ తిరిగేందుకు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇంకా ఆదేశాలు రాలే..

చేయూత పింఛన్ల పంపిణీలో మార్పులకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇంకా అధికారికంగా ఆదేశాల రాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసు ద్వారా చెల్లిస్తున్న పింఛన్లను బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం.

– కిషన్‌, డీఆర్‌డీవో, మంచిర్యాల

Advertisement
 
Advertisement
Advertisement