మంచిర్యాలఅగ్రికల్చర్: వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖతో కలిసి జిల్లా వ్యవసాయ శాఖ సహాయ అధికారులు, వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం జూన్, జూలైలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఆగస్టు, సెప్టెంబర్‌లో గత ఐదారేళ్లతో పోలిస్తే సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా వాతావరణంలో వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలని అన్నారు. మూడు నాలుగు రోజులపాటు వర్షాలు కురిసి భూమిలో ఒకటిన్నర అడుగుల లోతు వరకు తేమ ఉన్న తర్వాతే విత్తనాలు విత్తుకోవాలని రైతులకు సూచనలు చేయాలని అన్నారు. పంటల అవశేషాలు తగులబెడితే రైతులకు గ్రామ పంచాయతీల ద్వారా రూ.2,500 నుంచి రూ.15వేల వరకు జరిమానా విధించవచ్చని తెలిపారు. ఎనిమిది రకాల సన్న ధాన్యం సాగు చేసేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. రాబోయే పది రోజులపాటు వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశాలు నిర్వహించి సూచనలు చేయాలని తెలిపారు.


