చెన్నూర్/మంచిర్యాలఅగ్రికల్చర్/వేమనపల్లి/లక్సెట్టిపేట: జిల్లాలో గత కొద్దిరోజులుగా ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు సోమవారం కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడి ఉపశమనం లభించింది. సోమవారం మృగశిర కార్తె ప్రారంభం కావడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మృగశిర కార్తె రోజున తొలకరి వర్షం కురువడంతో రైతులు మురిసిపోయారు. కార్తె ప్రారంభంలో వర్షం కురిస్తే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అంటున్నారు. మంచిర్యాల, చెన్నూర్, వేమనపల్లి, లక్సెట్టిపేటలో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. లక్సెట్టిపేటలోని గోదావరి రోడ్డులో తాడిచెట్టుపై పిడుగు పడడంతో మంటలు వ్యాపించాయి. బలమైన ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. వేమనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన తరలించేందుకు భారీ సంఖ్యలో లారీలు వచ్చాయి. లోడ్ చేస్తున్న సమయంలో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. ఇప్పటికే దుక్కి దున్ని చేన్లు, పొలాలు సిద్ధం చేసుకున్న రైతులు తొలకరి వర్షంతో విత్తనా లు వేసేందుకు శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి.


