మంచిర్యాలఅర్బన్: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో బాలికలకు భద్రతతో కూడిన నాణ్యమైన విద్య అందుతోందని సెక్టోరల్ అధికారి విజయలక్ష్మి అన్నారు. సోమవారం స్థానిక కేజీబీవీలో అడ్మిషన్ల మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెసిడెన్షియల్ విధానంలో విద్యార్థినులకు ఉచిత విద్య, వసతి, భోజనం, పుస్తకాలు ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్నాయని తెలిపారు. జిల్లాలోని 18 కేజీబీవీల ప్రత్యేకతను తెలిపే స్టాళ్లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులకు వసతులు, విద్య, ఇతర సదుపాయాలపై వివరించారు. 40 మంది విద్యార్థుల తల్లిదండ్రులు రాగా 20 మంది అడ్మిషన్లు పొందారు. ప్రత్యేక అడ్మిషన్ల స్టాళ్లను ఎంఈవో మాళవీదేవి పరిశీలించారు. కార్యక్రమంలో కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.


