లీవ్‌ ఇట్‌ | - | Sakshi
Sakshi News home page

లీవ్‌ ఇట్‌

Jun 8 2026 11:30 PM | Updated on Jun 8 2026 11:30 PM

ఆర్టీసీ ఉద్యోగుల చుట్టీలకు తిప్పలు సెలవులు ఇవ్వని అధికారులు విన్నవించుకుంటున్నా పట్టించుకోని వైనం ఒత్తిడికి గురవుతున్న కార్మికులు

ఆదిలాబాద్‌: ఆర్టీసీ కార్మికులు పని ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అనారోగ్యాల బారినపడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. అనారోగ్యం దృష్ట్యా ఆస్పత్రికి వెళ్దామంటే అధికారుల నుంచి అనుమతులు రాక.. విధిలేని పరిస్థితుల్లో విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. తమకు సెలవులు మంజూరు చేయాలని విన్నవించుకుంటున్నా అధికారులు ఖరాకండీగా డ్యూటీ చేయాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. ఎవరైనా గట్టిగా వాదిస్తే వారిని టార్గెట్‌ చేసి ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. యూనియన్లు సైతం లేకపోవడంతో పైఅధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకే ఇబ్బంది అని లీవ్స్‌ ఇవ్వకపోయినా పని చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.

డ్యూటీ చేయాల్సిందే..

అనారోగ్యం, పలు కారణాలతో సెలవుల మంజూరు కోసం అధికారులకు అర్జీ పెట్టుకుంటే పూర్తిస్థాయిలో సిబ్బంది లేరని, తప్పకుండా డ్యూటీ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం హాఫ్‌ పే సెలవులు మంజూరు చేయాలని విన్నవించినా కనికరించడం లేదని ఆందోళన చెందుతున్నారు. పలు సందర్భాల్లో నేషనల్‌ హాఫ్‌ పేలను సైతం వాడుకునే పరిస్థితి లేక బలవంతంగా డ్యూటీకి ఎక్కుతున్నారు. ఇలాంటి సమయాల్లోనే పనిఒత్తిడితో పలు సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు.

నిబంధనలు ఇలా..

నిబంధనలకు అనుగుణంగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సంవత్సరంలో 15 సాధారణ సెలవు దినాలు ఉంటాయి. వీటితో పాటు ఏడాదికి 4 నేషనల్‌ హాఫ్‌ డేలను సైతం సెలవులుగా ఇస్తారు. జనవరి 26, అంబేడ్కర్‌ జయంతి, ఆగస్టు 15, గాంధీ జయంతి రోజున సెలవులుగా ప్రకటించారు. అయితే ఈ సెలవు రోజుల్లో సైతం ఆర్టీసీ బస్సులు నడపాల్సి ఉంటుంది. కార్మికులు డ్యూటీ చేయాల్సి వస్తున్న కారణంగా ఆ నాలుగు రోజులను ఇతర రోజుల్లో సెలవులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ప్రతీ 10 సంవత్సరాల కాలానికి 31 హాఫ్‌ పే సెలవులను ఆర్టీసీ మంజూరు చేసింది. వీటిని సైతం సెలవులుగా వినియోగించుకునే సౌలభ్యం కార్మికులకు ఉంటుంది.

విలీన ప్రకటనతో విధిలేని పరిస్థితిలో..

ఇటీవల ఆర్టీసీ కార్మికులు తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ సమ్మెకు దిగా రు. దిగివచ్చిన ప్రభుత్వం, వారితో చర్చలు జరిపి విలీన విషయంలో సానుకూలంగా స్పందించింది. ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైతే, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ఇతర సౌలభ్యాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే, విలీనం నాటికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసమే పరోక్షంగా కార్మికులపై పని ఒత్తిడి పెంచి, వారు స్వచ్ఛందంగా ఉద్యోగాల నుంచి తప్పుకునేలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. విలీన ప్రక్రియ ప్రారంభమయ్యే సమయానికి సంస్థలో ఉండకపోతే తీవ్రంగా నష్టపోతామనే భయంతో, సెలవులు దొరక్కపోయినా విధిలేని పరిస్థితుల్లో కార్మికులు విధులకు హాజరవుతున్నారు. కనీసం అత్యవసర సమయాల్లోనైనా సెలవులు మంజూరు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు.

సెలవులు మంజూరు చేస్తున్నాం..

కార్మికులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్న సమయాల్లో సిక్‌ లీవ్స్‌ ఇస్తున్నాం. అన్ని సందర్భాల్లో సెలవులు మంజూరు చేస్తున్నాం. ఉద్యోగ విరమణతో సిబ్బంది సంఖ్య తగ్గుతున్నా, ఔట్‌సోర్సింగ్‌ ద్వారా భర్తీ చేస్తున్నాం. కార్మికులకు సెలవుల మంజూరులో ఎటువంటి ఇబ్బంది లేదు. డిపోల పరిధిలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నా దృష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తా.

– విజయభాను, ఆర్టీసీ ఆర్‌ఎం, ఆదిలాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement