అమాత్య.. ఎలా? | - | Sakshi
Sakshi News home page

అమాత్య.. ఎలా?

Jun 8 2026 11:30 PM | Updated on Jun 8 2026 11:30 PM

మంత్రి పదవిపైనే మంచిర్యాల ఎమ్మెల్యే గురి

సివిల్‌ సప్లయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పోస్టు తిరస్కరణ

ఇటీవల సీఎం సభ సక్సెస్‌తో పీఎస్సార్‌కు క్రెడిట్‌

కేబినెట్‌లో చోటుపై పార్టీలో మరోసారి చర్చ

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంత్రి పదవిపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు(పీఎస్సార్‌) ఆశలు పెట్టుకున్నారు. ఆయన అనుచరవర్గమూ తప్పకుండా కేబినెట్‌లో చోటు లభిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో పెరిగిన సాన్నిహిత్యం ఇందుకు తోడవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పర్యటనను సక్సెస్‌ చేయడంతో పీఎస్సార్‌కు మంత్రి పదవి దక్కుతుందనే చర్చ మరోసారి సాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభలు విజయవంతం చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇటీవల ఆసిఫాబాద్‌లో ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేశారు. ఈ క్రమంలోనే కేబినెట్‌లో మార్పులు చేర్పులు జరిగితే పీఎస్సార్‌కు చోటు దక్కుతుందా..? అనే చర్చ జోరందుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సన్నిహితంగా ఉంటారు. ఈ క్రమంలో సీఎం వర్గానికి దూరంగా ఉంటారనే ప్రచారం ఉన్నప్పటికీ తాజాగా ఆసిఫాబాద్‌ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఎమ్మెల్యే పీఎస్సార్‌కు పెద్దపీట వేస్తూ ప్రాధాన్యత ఇచ్చారు. తిరుగు ప్రయాణంలో సీఎం హైదరాబాద్‌కు వెళ్తూ మంచిర్యాలలోని ఎమ్మెల్యే ఇంటి వద్ద కాసేపు ఆగారు.

ఆశించి, భంగపడి

ఉమ్మడి జిల్లా నుంచి పీఎస్సార్‌కు మొదటి, ఆ తర్వాత రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందని ఆశించినప్పటికీ చోటు దక్కలేదు. గతేడు ఏప్రిల్‌లో మంత్రివర్గ విస్తరణకు ముందు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘జై బాపు జై భీమ్‌, జై సంవిధాన్‌’ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనూ ఆయన మంత్రి పదవిపై బహిరంగంగానే తన అసంతృప్తిని వెల్ల డించారు. తర్వాత జిల్లా నుంచే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామికి అవకాశం దక్కింది. దీంతో ఇక పీఎస్సార్‌కు మంత్రి పదవి రాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఉమ్మడి జిల్లా నుంచి రెండో విడతలో చోటు ఖాయం అనుకున్నప్పటికీ దక్కలేదు.

నామినెటేడ్‌కు ససేమిరా

మంత్రి పదవి దక్కక అసంతృప్తితో ఉన్న పీఎస్సార్‌కు నామినేటెడ్‌తో బుజ్జగించేలా కార్పొరేషన్‌ పదవిలో నియమించారు. గత అక్టోబర్‌లో అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ప్రభుత్వం పీఎస్సార్‌ను కేబినెట్‌ హోదాతో సివిల్‌ సప్లయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిలో నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆయన బాధ్యతలు చేపట్టలేదు. అంతేకాక నామినేటెడ్‌ పోస్టులపై తనకు ఆసక్తి లేదని తేల్చారు.

అవకాశం ఉంటుందా?

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తోంది. అన్ని సామాజిక, ప్రాంతాలకు సీనియర్లకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు మొదలయ్యాయి. దీంతో కేబినెట్‌లో మార్పులు చేర్పులపై ఇప్పటికే రాష్ట్రంలో పలువురు సీనియర్‌ నాయకులు మంత్రి పదవిపై గంపెడాశలతో ఉన్నారు. ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్‌ చేసుకుంటున్నారు. దీంతో మూడో విడతలో ఎవరికి అవకాశం ఇస్తారోనని ఎదురు చూస్తునారు. ఇప్పటికే జిల్లా నుంచి మంత్రి ప్రాతినిధ్యం ఉంది. ఈ క్రమంలో పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యే పీఎస్సార్‌ను పార్టీ అధిష్టానం ఎలా బుజ్జగిస్తారనేది వేచిచూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement