మంచిర్యాలటౌన్: అంగన్‌వాడీ కేంద్రాలను బలోపే తం చేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ రెండేళ్లుగా వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రవేశాలను పెంచే కార్యక్రమంలో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ‘బడిబాట’ మాదిరిగానే రెండేళ్ల నుంచి ‘అమ్మ మాట అంగన్‌వాడీ బాట’ పేరిట విద్యాసంవత్సరం ప్రారంభంలోనే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సైతం మే 30 నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘అమ్మమాట అంగన్‌వాడీ బాట’ పేరిట జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మూడేళ్ల చిన్నారులు తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చేరేలా, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు దాటిన వారిని సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్లేస్కూల్‌కు పిల్లలను పంపించే తల్లిదండ్రులు అంగన్‌వాడీ కేంద్రాలకే వారి పిల్లలను పంపించేలా చేపడుతున్న ఈ కార్యక్రమాలకు ఆకర్షితులవుతుండడం, ప్రైవేటు కంటే మెరుగ్గా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ మారుతుండడంతో కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య ఏటా పెరుగుతోంది.
బ్రేక్‌ఫాస్ట్, భోజనం, విద్య ఒకేచోట అందేలా
జిల్లాలో 974 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 40,794 మంది ఉన్నారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారిని పాఠశాలల్లో చేర్పిస్తే చిన్నారుల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో మూడేళ్లు దాటిన పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వారిని అంగన్‌వాడీ కేంద్రాలకు తీసుకువచ్చేందుకు ‘అమ్మ మాట అంగన్‌వాడీ బాట’ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కేంద్రానికి వచ్చే చిన్నారులకు భోజనం, గుడ్డు, మురుకులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంతో పాటు పాలు, గుడ్లు అందిస్తున్నారు. చిన్నారులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాల్లోనే ఉండి పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే చిన్నారులకు మరింత పౌష్టికాహారం అందించేందుకు గానూ ఈ ఏడాది నుంచి బ్రేక్‌ఫాస్ట్ సైతం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాబోధనలో భాగంగా చిన్నారులకు ఆటపాటలు, కథలతో పాటు, సంభాషణ నైపుణ్యాలు నేర్పించి, చిన్ననాటి నుంచే మంచి అలవాట్లు అలవర్చుకునేలా సంసిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగానే అందిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల సేవలను చిన్నారులు సద్వినియోగం చేసుకునేలా, అంగన్‌వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న పిల్లలను గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలు పుట్టిన వెంటనే తల్లులు, పిల్లల పేర్లను సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రంలో నమోదు చేసి, బాలింతలకు అవసరమైన పౌష్టికాహారం, చిన్నారులకు బాలామృతం అందిస్తున్నారు. మూడేళ్లు వచ్చిన చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్చుకుని, ఆరేళ్ల వరకు వారికి కేంద్రాల్లోనే పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తూ పౌష్టికాహారంతో కూడిన భోజనం అందజేస్తున్నారు. అమ్మమాట అంగన్‌వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లు పైబడిన చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల నుంచి నేరుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేలా కార్యక్రమం చేపట్టనున్నారు.
అంగన్‌వాడీ
కేంద్రాలు 974
చిన్నారులు
40,794
బాలింతలు
3,543
గర్భిణులు
3,307
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల వివరాలు


