కొత్త వేతన ఒప్పందం ఎప్పుడో! | - | Sakshi
Sakshi News home page

కొత్త వేతన ఒప్పందం ఎప్పుడో!

Jun 7 2026 11:39 PM | Updated on Jun 7 2026 11:39 PM

ఈనెలాఖరుకు ముగియనున్న 11వ వేజ్‌బోర్డు

జూలై 1 నుంచి 12వ వేజ్‌బోర్డు అమలు కావాలి

3.2 లక్షల మంది కార్మికులపై ప్రభావం

శ్రీరాంపూర్‌: బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పంద కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. దేశవ్యాప్తంగా కోలిండియా దాని సబ్సిడరీ కంపెనీల్లో పనిచేసే కార్మికుల వేతనాలకు సంబంధించిన కీలకమైన 11వ వేతన ఒప్పందం కాలపరిమితి జూన్‌ 30, 2026తో ముగుస్తుంది. జూలై 1, 2026 నుంచి 12వ వేజ్‌బోర్డు అమలు కావాలి. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి కదలిక లేదు. 1వ వేజ్‌బోర్డు నుంచి 4వ వేజ్‌బోర్డు వరకు నాలుగేళ్ల ఒప్పంద కాలపరిమితితో ఒప్పందం జరగ్గా, ఆ తర్వాత నుంచి ఐదేళ్లకోసారి ఒప్పందం జరుగుతోంది. జూన్‌ 30 తర్వాత కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వేజ్‌బోర్డు ఏర్పాటు కోసం నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంటుంది. నూతన వేజ్‌బోర్డు కోసం దేశ వ్యాప్తంగా సుమారు 3.2 లక్షల మంది కార్మికులు ఎదురుచూస్తున్నారు.

కేంద్రంపై ఒత్తిడి..

నూతన వేతన ఒప్పందం కోసం జాతీయ సంఘాలు కేంద్రం, కోలిండియా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చేందుకు సన్నద్ధమయ్యాయి. గడిచిన రెండు వేజ్‌బోర్డుల సమయానికి బొగ్గు పరిశ్రమలు విస్తరించిన ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో రాజకీయ అవసరాల దృష్యా కేంద్ర ప్రభుత్వం అంతకు ముందు కంటే భిన్నంగా త్వరితగతిన వేజ్‌బోర్డు ఏర్పాటు, వేతన ఒప్పందానికి సహకరించాయి. ఈ వేతన ఒప్పందాన్ని నేషనల్‌ కోల్‌వేజ్‌ అగ్రిమెంట్‌(ఎన్‌సీడబ్ల్యూఏ) అని పిలుస్తారు. ఈసారి అలాంటి వాతావరణం లేకపోవడం, కోలిండియాలో షేర్ల విక్రయాలు, ప్రైవేటు బొగ్గు బ్లాకులు పెరిగి ప్రభుత్వ రంగ పరిశ్రమలు గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఈ సమయంలో వేజ్‌బోర్డు కమిటీ ఏర్పాటు, ఒప్పందం ఎప్పుడు జరుగుతుందోనన్న సందేహం వ్యక్తమవుతోంది.

జేబీసీసీఐ ఏర్పాటుకు ఒత్తిడి..

ప్రతీ వేతన ఒప్పందం కోసం కేంద్ర ప్రభుత్వం కోలిండియా యజమాన్యం, జాతీయ కార్మిక సంఘాలతో జాయింట్‌ బైపార్టియేట్‌ కన్సల్టేటివ్‌ కమిటీ ఫర్‌ కోల్‌ ఇండస్ట్రీ(జేబీసీసీఐ) పేరుతో కమిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్‌ ఇస్తారు. దీని ప్రకారం జాతీయ సంఘాలు తమ సభ్యుల పేర్లను అందజేస్తారు. కోలిండియా చైర్మన్‌ ఈ జేబీసీసీఐకి చైర్మన్‌గా వ్వవహరిస్తారు. జాతీయ సంఘాల సభ్యుల పేర్లను ఖరారు చేసిన తర్వాత పూర్తి కమిటీ స్వరూపం ఏర్పడి వేతన ఒప్పందం కోసం చర్చలు మొదలవుతాయి. ఈ ప్రక్రియకు ప్రతీసారి జాప్యం జరుగుతుండగా ఈసారి మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు, అలవెన్సుల పెంపు కోసం కార్మిక సంఘాలు తమ డిమాండ్ల తయారీలో నిమగ్నమయ్యాయి. ఇదిలా ఉంటే 11వ వేతన ఒప్పందం 23 నెలల ఆలస్యంతో మే 20, 2023న ఒప్పందం జరిగింది. ఇందులో సగటు కార్మికుని బేసిక్‌ వేతనం రూ.6,973.30 పెంపుదల జరిగింది. ఈసారి దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులకు తోడు, యుద్ధాల ప్రభావం కూడా వేతన ఒప్పందాలపై ఉంటుందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా వరుస విజయాలతో రాజకీయ సుస్థిరతను సాధించుకున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం కోసం తమ ఒత్తిడికి ఏమాత్రం దిగి వస్తుందోనన్న సందేహం కార్మిక సంఘాల నేతల్లో నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement