సెలవులు మూడు రోజులు పొడిగింపు
పాఠశాలలు సిద్ధం చేసుకునే తరుణం ఇదే
తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
వాటర్‌ట్యాంకు, మరుగుదొడ్లు క్లీనింగ్‌పై దృష్టి సారించాలి
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులు మూడురోజులు పొడిగించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా జూన్ 13న రెండో శనివారం, 14న ఆదివారం సెలవులు ఉండటంతో పాటు పలు వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల పున:ప్రారంభం వాయిదా పడినందువల్ల కోల్పోయిన విద్యాదినాలను భర్తీ చేయడానికి జూలై 11న రెండో శనివారం సాధారణ పనిదినంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో 1,051 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉండగా 1,32,322 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అన్ని పాఠశాలలు జూన్ 15న ప్రారంభించాలని విద్యాధికారులకు ఆదేశాలు వచ్చాయి.
పాఠశాలలు సిద్ధం చేసుకోవాలి..
కొత్త విద్యాసంవత్సరం మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుండటంతో పాఠశాలలు సిద్ధం చేసుకోవాలి. తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టాలి. విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అన్ని పాఠశాలలు ముందస్తు చర్యలు తీసుకోవాలి. స్కావెంజర్‌లకు నిబంధనల ప్రకారం పది నెలలు వేతనాలు చెల్లిస్తారు. జూన్ ఒకటి నుంచి వేతనాలు చెల్లించే నేపథ్యంలో మొక్కలకు నీరు పోయడం, తదితర పనులపై దృష్టి సారించేలా హెచ్‌ఎంలు చొరవ చూపాలి.
వాటర్ ట్యాంకులపై కన్నేయండి..
పాఠశాలల్లో ఉపరితల ట్యాంకులను 15 రోజులకోసారి, భూగర్భ ట్యాంకులను నెలకోసారి శుభ్రం చేయాల్సి ఉంది. రక్షిత నీటితో వంటలు చేయాలని ప్రభుత్వ నిబంధనల్లో పేర్కొంది. ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో బోరు నీటితోనే వంటలు చేస్తుండడం పరిపాటిగా మారింది. మరికొన్నింట్లో ట్యాంకుల నుంచి వచ్చే నీటితో వంటలు చేస్తున్న సందర్భాలు న్నాయి. పాఠశాలలకు మిషన్ భగీరథ పైపులున్నా నీటిసరఫరా అంతంతమాత్రంగానే ఉంది. పాఠశాలలు చాలా రోజులుగా మూసివేయడంతో ట్యాంకులు శుభ్రం చేయక నాచు పేరుకుపోయి.. నీటిలో పురుగులు వచ్చే ప్రమాదముంది. అపరిశుభ్ర వా తావరణం వల్ల విద్యార్థులు అనారోగ్యం బారిన ప డే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు వాపోతున్నా రు. ట్యాంకులను శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలి.
మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తం
జిల్లాలోని మండల విద్యావనరుల కేంద్రాలు సమస్యలకు నిలయంగా మారాయి. నిర్వహణ, సౌకర్యా ల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా విని యోగంలో జవాబుదారీతనం లోపిస్తోంది. కొన్ని మండలాల్లో తాగునీరు లేని పరిస్థితి. మరికొన్ని చోట్ల మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అవసరం నిమిత్తం వచ్చినప్పుడు టాయిలెట్‌కు వెళ్లాలంటే మరుగుదొడ్ల పరిస్థితి చూసి ముక్కుమూసుకుంటూ వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. వేసవి సెలవుల్లోనే మరుగుదొడ్లు క్లీనింగ్‌తో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.


