● రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాలక్రైం: నేరస్తులకు శిక్ష పడే విధంగా కోర్టు డ్యూటీ పోలీస్ అధికారులు కీలక పాత్ర పోషించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా అన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో శనివారం కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లు, లైజనింగ్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై జరిగే నేరాలు, ఆస్తి సంబంధిత నేరాలు, దాడులు, తదితర కేసుల్లో నిందితులకు తప్పనిసరిగా శిక్ష పడే విధంగా పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి బలమైన సాక్ష్యధారాలను కోర్టులో ప్రవేశ పెట్టాలని తెలిపారు. నేరం జరిగిన వెంటనే సంఘటన ప్రభావం తగ్గక ముందే శిక్ష పడితే అది నేరస్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. నేరస్తులకు శిక్ష పడితేనే పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, వర్టికల్ ఇంచార్జి సీఐ చంద్రశేఖర్‌గౌడ్, సీసీఆర్‌బీ సీఐ అనిల్‌కుమార్, బాబురావు, ఎస్సై వినీత, కోర్టు డ్యూటీ సిబ్బంది, కోర్టు లైజనింగ్ అధికారులు పాల్గొన్నారు.


