మంచిర్యాలటౌన్: వారసత్వ రాజకీయాలతో పెద్దపల్లి ఎంపీగా ఎన్నికైన గడ్డం వంశీకృష్ణకు బీజేపీ నాయకులను విమర్శించే నైతిక హక్కు లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్, నగరంలోని రోడ్లపై ఎంపీ ఫొటోను ప్రజలకు చూపిస్తూ ఈయనను ఎప్పుడైనా మంచిర్యాలలో చూశారా, గుర్తు పట్టారా అంటూ అడుగుతూ శనివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం వెంకటేశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ మంచిర్యాల రైల్వేస్టేషన్ ఎదుట ముసుగేసి ఉన్న కాకా వెంకటస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించకుండా తండ్రీకొడుకులు అవమానించారని విమర్శించారు. తాత విగ్రహాన్ని ఆవిష్కరించలేని ఎంపీ వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నానని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుర్గం అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల కృష్ణమూర్తి, జోనల్ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్‌కుమార్, కుర్రె చక్రవర్తి, సత్రం రమేశ్, కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బొట్ల అనిత, బొట్ల సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.


