మహిళను కర్రతో కొట్టి చంపిన నిందితుడు! వేరే వ్యక్తితో చనువుగా ఉందని అఘాయిత్యం మల్కెపల్లిలో ఘటన
కాసిపేట: మహిళతో తోడుగా ఉంటానని మాటిచ్చి సహజీవనం చేస్తూ, ఆపై అనుమానంతో ఆమెను కడతేర్చాడు. మండలంలోని మల్కెపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మందమర్రి మండలం బుర్రగూడంకు చెందిన దుర్గం లక్ష్మి (40)ని భర్త రెండేళ్ల క్రితం వదిలివెళ్లాడు. తన ఐదుగురు పిల్లలతో ఉంటూ కూలీ పనిచేసుకుంటూ జీవిస్తోంది. ఈక్రమంలో కూలీ పనిచేసుకుంటున్న సమయంలో కాసిపేట మండలానికి చెందిన పడిగల సంతోష్‌తో ఆరునెలల క్రితం లక్ష్మికి పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటామని మల్కెపల్లిలో సహజీవనం చేస్తున్నారు. లక్ష్మి కూలీ పనిచేసే చోట వేరే వ్యక్తితో చనువుగా ఉంటుందని సంతోష్ అనుమానించేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వారి మధ్య గొడవ జరిగింది. కోపాద్రికుడైన సంతోష్ ఆమెను కర్రతో కొట్టగా రక్తపు గాయాలతో పడిపోయి ఉంది. వెంటనే ఆమెను కాసిపేట పీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతిచెందింది. మృతురాలిపై గాయాలు ఉండడం చూసి అనుమానం వ్యక్తం చేస్తూ దేవాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మల్కెపల్లికి పోలీసులు వెళ్లి విచారణ చేపట్టారు. లక్ష్మి, సంతోష్ మధ్య గొడవ జరిగిందని స్థానికులు చెప్పారు. కర్రతో కొట్టి అక్కడే ఉన్న ఏదో పదునైన ఇనుప వస్తువుతో పొడిచి చంపి యాక్సిడెంట్‌గా నమ్మించడానికి ఆస్పత్రికి తరలించినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. మృతురాలి కుమారుడు దుర్గం రాజబాను ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగారాం తెలిపారు. తల్లి మృతితో ఐదుగురు పిల్లలు అనాథలుగా మిగిలారు.


