జన్నారం: అడవులు ప్రకృతి ప్రసాదించిన వరమని, వాటిని రక్షించుకోవడం మనందరి బాధ్యత అని జన్నారం అటవీ డివిజనల్ అధికారి (ఎఫ్‌డీవో) రామ్మోహన్ అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళి క కార్యక్రమంలో భాగంగా గురువారం జన్నారం, దండేపల్లి మండలాలకు చెందిన విలేకరులకు వనదర్శిని కార్యక్రమంలో భాగంగా అడవులపై అవగాహన కల్పిస్తూ చేపడుతున్న అభివృద్ధి, రక్షణ గురించి వివరించారు. 2012లో ఏర్పాటైన కవ్వాల్ టైగర్‌జోన్‌లో పులులు రాకపోకలు సాగిస్తూ, ఇక్కడ అవాసం ఉండకపోవడానికి అనేక కారణాలున్నాయన్నారు. వాటిని నివృత్తి చేస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. తాడోబాలాంటి టైగర్‌జోన్‌లో అక్కడి ప్రజలు అనేక ఉపాధి పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రేంజ్ అధికారులు ఖాదర్‌వలీ, లక్ష్మీనారాయణ, డీఆర్వో రాము, సెక్షన్ అధికారులు శంకర్, శేషరావ్, బీట్ అధికారులు అనిత, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.


