మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలోని 60 డివిజన్లలో పారిశుద్ధ్యం మెరుగుపర్చుకోవాలని మేయర్ దర్ని మధుకర్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం 11వ డివిజన్ సాయికుంటలో వార్డుసభ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మేయర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తడి, పొడి చెత్తను ఇంటి నుంచి వేరు చేసి చెత్త తరలించే ఆటోలకు ఇవ్వాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా, మురుగునీరు రోడ్డుపైకి రాకుండా చూడాలన్నారు. ఏసీపీ ప్రకాశ్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. లైసెన్సు లేకుండా వాహనాలను ఇవ్వవద్దని, అలా చేస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. 15వ డివిజన్‌లో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య పాల్గొన్నారు.


