పాతమంచిర్యాల: యువత భవిష్యత్‌తో రాజకీయాలు వద్దని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలు నమ్మి యువత తమ భవిష్యత్‌ను ప్రమాదంలో పడేసుకోవద్దన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ఉపాధి అవకాశాల విషయంలో యువతకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే సుమారు 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. యువతకు ఉపాధి నైపుణ్యాభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు ఏర్పాటు చేసి ఉద్యోగాల సాధనకు కృషి చేస్తోందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతించాల్సింది పోయి బీఆర్‌ఎస్ నాయకులు అపోహలు సృష్టిస్తూ యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారని విమర్శించారు. యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. వాస్తవాలను గుర్తించి అభివృద్ధి పథంలో పయనించాలని యువతకు పిలుపునిచ్చారు.


