అగ్గి రాజుకుంటే.. బుగ్గే | - | Sakshi
Sakshi News home page

అగ్గి రాజుకుంటే.. బుగ్గే

Jun 5 2026 4:29 AM | Updated on Jun 5 2026 4:29 AM

● వేసవిలో తరచూ ప్రమాదాలు ● సకాలంలో చేరుకోని ఫైరింజన్లు ● రూ.కోట్లలో ఆస్తులు బుగ్గిపాలు ● తీవ్రంగా నష్టపోతున్న బాధితులు

లక్సెట్టిపేట: మండలానికి అగ్ని మాపక కేంద్రం మంజూరు కలగానే మిగిలింది. దీంతో వేసవి వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగి బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు. నిత్యం ఏదో ఒక ప్రదేశంలో అగ్ని ప్రమాదం జరుగుతున్నా సుదూర ప్రాంతాల నుంచి అగ్నిమాపక యంత్రాలు వచ్చేసరికి ఆస్తులు కాలి బూడిదైపోతున్నాయి. ఒక్క మే నెలలో 42 కేసులు నమోదైనట్లు అగ్నిమాపకశాఖ అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో నాలుగే కేంద్రాలు

జిల్లాలో మంచిర్యాల, జన్నారం, బెల్లంపల్లి, చెన్నూర్‌లో అగ్నిమాపక కేంద్రాలున్నాయి. అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎటు వెళ్లినా సుమారు 25కిలోమీటర్ల దూరం పోవాల్సి ఉంటుంది. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఫైరింజన్‌ రావాలంటే దూరభారానికి తోడు ట్రాఫిక్‌ కారణంగా సమయం వృథా అవుతూ ఆలోపే ఆస్తులు కాలిపోతున్నాయి.

ఒక కేంద్రంలో ఒక్కటే..

గతంలో నియోజకవర్గంగా ఉన్నప్పటి నుంచి లక్సెట్టిపేటలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారు. వ్యవసాయాధారిత గ్రామాల్లో ఎక్కువగా పూరి గుడిసెలే ఉంటాయి. దీంతో పలుసార్లు అగ్నిప్రమాదాలు జరిగినపుడు అగ్నిమాపక యంత్రం వచ్చేసరికి ఆస్తులు కాలిపోవడంతో బాధితులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతీ కేంద్రానికి ఒక ఫైరింజన్‌ మాత్రమే ఉన్నది. అందులో నీరు అయిపోతే మళ్లీ వెనక్కి వచ్చి నీటిని నింపుకొని వెళ్లాల్సి వస్తోంది. నీరు అందుబాటులో లేకుంటే మంటలు ఆర్పడం సాధ్యం కాదు. కేంద్రానికి రెండు ఫైరింజన్లు ఉంటే సకాలంలో ప్రమాద స్థలికి చేరి మంటలు ఆర్పే వీలుంటుంది.

ఇటీవలి ఘటనల్లో కొన్ని..

ఇటీవల మండల కేంద్రంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం సంభవించగా ఫైరింజన్‌ వచ్చేసరికి రూ.లక్షల విలువైన ఆస్తి కాలిబూడిదైంది. స్థానిక ఎస్‌బీఐ బ్యాంక్‌లో అకస్మాత్తుగా మంటలు రావడంతో స్థానికులు మంటలు ఆర్పగా అప్పటికే స్టేషనరీ కాలిపోయింది. వెంకట్రావుపేట, పోతపల్లి, జెండావెంకటాపూర్‌ తదితర గ్రామాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించి బాధితులు ఆస్తులు కోల్పోయారు. అధికారులు పట్టించుకుని మండలంలో ఫైర్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

తెలిసిన వెంటనే పంపిస్తున్నాం

అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సమాచారం రాగానే వెంటనే వాహనాలను పంపిస్తున్నాం. కొన్ని ప్రదేశాలు దూరంగా ఉండడంతో ఆస్తులు కాలిపోతున్నాయి. లక్సెట్టిపేటలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది.

– శ్రీనివాస్‌ అగ్నిమాపక అధికారి, జన్నారం

Advertisement
 
Advertisement
Advertisement