దస్నాపూర్‌లో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

దస్నాపూర్‌లో అగ్నిప్రమాదం

Jun 5 2026 4:29 AM | Updated on Jun 5 2026 4:29 AM

ఆసిఫాబాద్‌: జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. బండె తిరుపతి ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు రావడంతో ఇంటి ఆవరణలో ఉన్న జొన్న చొప్పకు గమనించిన కుటుంబసభ్యులు బయటకు వచ్చారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు పక్కన ఉన్న బండె సావిత్రి బాయి ఇంటికి వ్యాపించాయి. స్థానికులు వెంటనే ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఫర్నిచర్‌, సామన్లు, నగదు, దుస్తులు, బంగారంతోపాటు అన్ని వస్తువులు, అగ్నికి అహుతయ్యాయి. అదే సమయంలో తిరుపతికి చెందిన రెండు మేకలను స్థానికులు రక్షించగా, 8 కోళ్లు మంటల్లో కాలిపోయాయి. ప్రమాదంలో రూ. 10 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. తహసీల్దార్‌ రియాజ్‌ అలి ఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఏఎంసీ చైర్‌పర్సన్‌ ఇరుకుల్ల మంగ, డీసీసీ ఉపాధ్యక్షుడు తారిక్‌, మాజీ ఎంపీటీసీ సిడాం తిరుపతి, మారుతి పటేల్‌, గోవిందు అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించారు. డీసీసీ అధ్యక్షురాలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలిపారు. స్పందించిన మంత్రి జూపల్లి, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఆదేశాల మేరకు బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని హౌజింగ్‌ పీడీని ఆదేశించారు. తక్షణసాయం కింద రెండు కుటుంబాలకు రూ. 95,100 ఆర్థికసాయం అందజేసినట్లు కలెక్టర్‌ కె.హరిత తెలిపారు. ఆత్రం సుగుణ తన వంతుగా రూ. 11 వేల నగదు, 50 కిలోల బియ్యం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు రూ. 10 వేలు ఆర్థికసాయం అందించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి.. బాధితులను పరామర్శించి రూ. 20 వేల నగదు, సరుకులు, దుస్తులు అందించారు. ప్రభుత్వం నుంచి రావల్సిన సహకారం అందేలా చూస్తానన్నారు.ఆమె వెంట బీఆర్‌ఎస్‌ నాయకురాలు సరస్వతి, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాశ్‌, వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు అలిబిన్‌ అహ్మద్‌, సాలం,సాయిశ్రవణ్‌, అబ్దుల్లా, అశోక్‌, రవీందర్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement