మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల డీఈవో యాదయ్య బదిలీ అ య్యారు. ఆదివారం పాఠశాల విద్యాశాఖలో బదిలీపై నిషేధం ఎత్తివేయడం.. డీడీ, డీఈవో లకు బదిలీల్లో భాగంగా యాదయ్యను హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మూడేళ్ల క్రితం మహబూబ్‌నగర్ డీఈవోగా పనిచేస్తున్న ఆయన 2023 మే 5న మంచిర్యాలకు బదిలీపై వచ్చారు. పరిపాలనా పరమైన విషయాలు, విద్యా కార్యక్రమాలపై తనదైన ముద్ర వేశారు. మూడేళ్ల కాలంలో పదోన్నతులు, బదిలీల నియామకాలను పారదర్శకంగా నిర్వహించారు. పదో తరగతి పరీక్షల్లో ఏయేటికాయేడు ఉత్తీర్ణత శాతం మెరుగుపడేలా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన టీచర్లపై కొరడా ఝులిపించారు. మంచిర్యాల ప్రభుత్వ పాఠశాల (హరిజనవాడ) పరిధిలో ఉన్న స్టేషన్ రోడ్ స్కూల్‌ను బాయ్స్ హైస్కూల్‌కు తరలించి నిలబెట్టారు. తొమ్మిది మంది విద్యార్థుల నుంచి 120కు పైగా విద్యార్థులు ప్రవేశం పొందారంటే ఆయన కృషి చెప్పకతప్పదు. విద్యార్థులు వివిధ జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించేలా వెన్నుతట్టి ప్రోత్సహించారు. ప్రస్తుతం మంచిర్యాల డీఈవోగా ఎవరినీ నియమించలేదు.


