నిర్మల్‌టౌన్: భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. జిల్లాలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంట్లో ఏసీలు, కూలర్లతో ఉపశమనం పొందుతుండగా, బయటకు వెళ్లేవారు ఎండవేడికి తట్టుకోలేకపోతున్నారు. వేసవితాపం నుంచి కాస్త చల్లదనాన్ని అందించే స్విమ్మింగ్ పూల్స్ విద్యార్థులు, యువతకు హాట్ ఫేవరెట్‌గా మారాయి. వేసవి సెలవుల్లో స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళలో ఈతకొడుతున్నారు. కోచ్‌లు వారికి ఈతలో శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల స్విమ్మింగ్ క్రీడకు గుర్తింపుతో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటుకోవచ్చని ఉద్దేశంతో పలువురు విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. చిన్న వయసులోనే ఈత నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని కోచ్‌లు చెబుతున్నారు.
ఫిట్‌గా ఉండేందుకు..
వేసవి వేడి తట్టుకోవడానికి స్విమ్మింగ్ ఉపయోగపడుతుంది. గత నెల రోజులుగా ప్ర తీరోజు స్నేహితులతో కలిసి ఈత కొడుతున్నా. తక్కువ ధ రకు స్విమ్మింగ్ చేసే అవకాశం ఉంది. శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ఫిట్‌గా ఉండేందుకు స్విమ్మింగ్ చేస్తున్నా. – సూర్యతేజ
ఆనందంగా ఉంది
వేసవి సెలవుల్లో స్విమ్మింగ్ చేస్తున్నా. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందడంతోపాటు శరీరానికి వ్యాయామం లభిస్తుంది. స్నేహితులతో కలిసి వచ్చి చేయడం ఆనందంగా ఉంది. – త్రినయన్


