● యూనియన్‌ నుంచి లేఖలు ● ట్రాన్స్‌ఫర్‌ తప్పించుకునేలా ఎత్తులు ● పలువురు ఉద్యోగుల తీరుపై ఆరోపణలు ● పారదర్శకంగా జరిగితేనే అర్హులకు మేలు | - | Sakshi
Sakshi News home page

● యూనియన్‌ నుంచి లేఖలు ● ట్రాన్స్‌ఫర్‌ తప్పించుకునేలా ఎత్తులు ● పలువురు ఉద్యోగుల తీరుపై ఆరోపణలు ● పారదర్శకంగా జరిగితేనే అర్హులకు మేలు

May 31 2026 1:36 AM | Updated on May 31 2026 1:36 AM

● యూనియన్‌ నుంచి లేఖలు ● ట్రాన్స్‌ఫర్‌ తప్పించుకునేలా ఎత్తులు ● పలువురు ఉద్యోగుల తీరుపై ఆరోపణలు ● పారదర్శకంగా జరిగితేనే అర్హులకు మేలు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సాధారణ బదిలీల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అక్రమాలకు తెరలేపారు. ఈ నెల ఒకటి నుంచి 31లోపు బదిలీల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నేటితో బదిలీల పక్రియ పూర్తి కానుంది. వచ్చే నెల 3లోపు ఉద్యోగులు తమకు బదిలీ జరిగిన స్థానాల్లో విధుల్లో చేరాలి. వచ్చే జూన్‌ ఒకటి నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం అమలు కానుంది. ఈ బదిలీల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా సాగించేలా నోడల్‌ అధికారులను నియమించారు. రాష్ట్ర, మల్టీ జోన్‌, జిల్లా స్థాయిల్లోని ఆయా శాఖల్లో ఉన్నతాధికారులతో కమిటీలు నియమించారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు మూడేళ్లు ఒకేచోట సర్వీసు పూర్తయితే వారికి బదిలీ చేసుకునే అర్హత పొందుతున్నారు. ఇక నాలుగేళ్లు దాటిన వారైతే తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే.

తప్పించుకునేందుకు ప్రయత్నాలు

ఇప్పటికే కొందరు ఉద్యోగులు అనారోగ్యం, వైకల్యం, స్పౌజ్‌ కోటా కింద బదిలీల నుంచి మినహాయింపు పొందారు. 2027 మే 31వరకు రిటైర్డు అయ్యే వారికి కూడా ఈ బదిలీల్లో మినహాయింపు ఇవ్వాలి. ఇక జనగణన విధుల్లో ఉన్న టీచర్లకు మినహాయింపు ఉండగా నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులకు బదిలీలు జరగనున్నాయి. దీంతో కొందరు రిజర్వులో ఉన్న ఉద్యోగులు సైతం బదిలీ కాకుండా చూసుకుంటున్నారు. ఒక్కో శాఖ పరిధిలో మొత్తం 40శాతం మించొద్దనే నిబంధనను అడ్డుపెట్టుకుని కూడా కొందరు తప్పించుకుంటున్నారు.

రాజకీయ పైరవీలు

ఇక కొందరు ఉద్యోగులు అధికార పార్టీ నేతలతో పైరవీలు చేసుకుంటున్నారు. జోన్‌, మల్టీ జోన్‌ పరి ధిలోని కొందరు ఉద్యోగులు జిల్లాను దాటి ఇతర జిల్లాలు, మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని పలు రకాలుగా ప్రయత్నిస్తున్నారు. దీంతో అర్హులు, ఇతర జిల్లాల నుంచి జిల్లాకు వచ్చేందుకు అర్హత ఉన్నా రాలేకపోతున్నామని వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement