మంచిర్యాలఅర్బన్: తెలంగాణ ప్రభుత్వం సర్కారు పాఠశాలలను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను విస్తరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది నుంచి జిల్లాలో 44 ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య అమలు చేస్తోంది. వీటిలో ఐదేళ్లలోపు చిన్నారులకు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించారు. 2026–27 విద్యాసంవత్సరానికి మరో 72 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రతీ పాఠశాలకు రూ.లక్ష వరకు నిధులు కేటాయించి చిన్నపాటి మరమ్మతులు, ఫర్నిచర్, ఇండోర్–అవుట్‌డోర్ క్రీడా సామగ్రి, బాల పెయింటింగ్స్ సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ ప్రీ ప్రైమరీ సెక్షన్‌కు ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను గౌరవ వేతనాలపై నియమించాలని సూచించింది.
పూర్వ ప్రాథమిక విద్య అమలుతో..
జిల్లాలో 511 ప్రాథమిక పాఠశాలల్లో 13,678 మంది విద్యార్థులు, 97 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 4,234 మంది, 108 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 23,442 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మూడేళ్ల పిల్లల్ని చేర్చుకుంటే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ చదివించాలంటే రూ.వేలల్లో ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. సర్కారు బడిలో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గనుంది. జిల్లాలో గతేడాది నుంచి ఆయా పాఠశాలల యాజమాన్యాలు ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తుండగా కొన్నింటిలో విద్యార్థుల ప్రవేశాలు మెరుగ్గా ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడి విద్యార్థుల సంఖ్య పెంచారు. 44 పాఠశాలల్లో పీపీ–1 (నర్సరీ), పీపీ–2 (యూకేజీ), పీపీ–3 (ఎల్‌కేజీ) పూర్వ ప్రాథమిక విద్య తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రీ ప్రైమరీ తరగతుల ఇన్‌స్ట్రక్టర్లు (బోధకులు), ఆయా (సహాయకులు)లను నియమించి వేతనాలు చెల్లించారు.
సర్కారు బడుల్లోనే చేర్పించాలి
జిల్లాలో పూర్వప్రాథమిక అమలుకు జిల్లాలో 72 పాఠశాలలకు అనుమతి లభించింది. గతేడాది 44 పాఠశాలలను కలుపుకొంటే మొత్తం 116 పాఠశాలల్లో విద్యార్థుల ఆడ్మిషన్లు ప్రక్రియ ప్రారంభించాలని ఎంఈవో, ఉపాధ్యాయులను ఆదేశించాం. కొత్తగా అనుమతి పొందిన పాఠశాలల్లో నిబంధనల ప్రకారం ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను నియమిస్తాం. ప్రతీ పాఠశాలలో విద్యార్థులకు ఇండోర్ అవుట్‌డోర్ ప్లే మెటీరియల్, ఆకర్షణీయమైన పెయింటింగ్‌లు ఉంటాయి. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్‌కు సర్కారు పాఠశాలలోన్లే చేర్పించాలి.
– యాదయ్య, డీఈవో


