మంచిర్యాలఅగ్రికల్చర్: మన ప్రజాస్వామ్యం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్నేహ సంఘాల సభ్యులతో మాక్ పార్లమెంటు నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, నగర మేయర్ ధర్ని మధుకర్, జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ అధికారులు కిషన్, యాదయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ శాసనసభ, పార్లమెంటు, జిల్లా, మండల పరిషత్, సర్పంచ్ ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకునే స్వేచ్ఛ కలిగి ఉన్నామని తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. విద్యా అనేది ఉద్యోగం కోసం మాత్రమే కాదని, సమాజంలో ప్రతీ అంశాన్ని తెలుసుకోవాలని, హక్కులు, చట్టాలు తెలుసుకోవాలని, విద్యార్థులు ఆత్మరక్షణ విద్య నేర్చుకోవాలని తెలిపారు. మాక్ పార్లమెంట్‌లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసపత్రాలు అందజేశారు.


