నెన్నెల: ఇరవై రోజుల క్రితం తేమ శాతం చూసి కాంటా వేసిన ధాన్యం బస్తాలను మళ్లీ తేమ పరీక్షలు నిర్వహించి తూకం వేయాలని, అంతవరకు ధాన్నాన్ని తరలించేది లేదని డీసీఎంఎస్ నిర్వాహకుడు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గొల్లపల్లి రైతులు శనివారం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి తమ గోడు వెల్లబోసుకున్నారు. తూకం వేసిన ధాన్యం బస్తాలను తహసీల్దార్ శ్రీనివాస్ ఎదుట ఉంచి తేమ శాతం పరీక్షించాలని కోరారు. కావాలనే గోస పెడుతున్నారని విన్నవించారు. ఈ నెల 10న కాంటా అయిన బస్తాలను ఖాళీ చేసి మళ్లీ తూకం వేయమంటే ఎలా సారూ అని ప్రశ్నించారు. తహసీల్దార్ స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో రైతులు మెండి కిష్టయ్య, కాల్వ రాజం, బండి రమేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


