కెరమెరి: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో కొత్తగూడ ఓ మారుమూల గ్రామం.. అక్కడ నివసించేది గిరిజనులే.. ఆ గ్రామానికి జిల్లాస్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల పర్యటనలే అరుదు.. కానీ ఇప్పుడు ఆ గ్రామానికి ఏకంగా ముఖ్యమంత్రి రానున్నారు. ప్రభుత్వ చొరవతో కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పండుగ వాతావరణంలో జూన్ 1న ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.
అందరికీ ఇళ్లు..
కొఠారి పంచాయతీ పరిధిలో కొఠారి, కొలాం కొఠారి, అంబారావుగూడ, కొత్తగూడ, కల్లెగాం గ్రామాలు ఉన్నాయి. 241 కుటుంబాలు ఉండగా 1976 మంది జనాభా ఉంది. పంచాయతీకి మొత్తం 110 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇక కొత్తగూడ గ్రామంలో 36 కుటుంబాలు ఉండగా, 166 జనాభా ఉంది. గతంలోనే 10 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు హయాంలో మిగతా 26 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేశారు. కానీ ఇందులో కుటుంబ యజమాని మరణంతో ఒకటి రద్దు కాగా, మిగిలిన 25 ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పనుల నిర్మాణంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. శనివారం నాటికి 18 గృహాలు పూర్తికాగా, సోమవారం నాటికి అన్ని ఇళ్లూ ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని చెబుతున్నారు. మరోవైపు మిగిలిన ఒక కుటుంబంతోపాటు పాత ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారికి మరోసారి ఇళ్ల కోసం ప్రతిపాదనలు పంపిస్తామని వారు పేర్కొంటున్నారు.
ముమ్మరంగా ఏర్పాట్లు
గత వారం రోజులుగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం గ్రామాన్ని సందర్శిస్తూ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీ రోడ్డు వేయడంతోపాటు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. శనివారం కలెక్టర్ హరిత హెలిప్యాడ్‌తోపాటు ఇతర ఏర్పాట్లు పరిశీలించారు. గ్రామస్తులతో సహపంక్తి భోజనానికి, లబ్ధిదారులతో ముఖాముఖికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే కుమురంభీం జిల్లా ఎస్పీ నితిక పంత్, ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. తొలిసారి కొత్తగూడకు వస్తున్న ముఖ్యమంత్రి గ్రామానికి వరాల జల్లు కురిపిస్తారని స్థానికులు ఆశిస్తున్నారు.
సీఎం రావడం మా అదృష్టం
సీఎం మా గ్రామానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇక్కడికి వస్తారని కలలో కూడా ఊహించలేదు. చాలా కాలంగా ఇక్కడ పెంకు, రేకుల ఇళ్లు, గుడిసెలు ఉన్నాయి. ప్రభుత్వం చొరవతో అన్ని కుటుంబాలకు పక్కా ఇళ్లు వచ్చాయి. సీఎం పర్యటన నేపథ్యంలో గ్రామ రూపురేఖలు సైతం పూర్తిగా మారిపోయాయి.
– మడావి శాంతాబాయి,
సర్పంచ్, కొఠారి పంచాయతీ
ఆ కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తాం
కెరమెరి: గంగుబాయి, భీము దంపతులకు గతంలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. కానీ గంగుబాయి అనారోగ్యంతో మృతి చెందడంతో నిర్మాణం చేపట్టలేక పోయారు. వారి కుమారుడు కూడా మృతి చెందడం, కోడలు లేకపోవడంతో మనుమరాలు వైశాలి, అంజలి భీము వద్దే ఉంటున్నారు. వీరిద్దరూ కూడా మేజర్ కాకపోవడంతో వారి పేరిట కూడా ఇల్లు మంజూరు చేయరాదు. అయితే ఈ కేసును ప్రత్యేకంగా పరిశీలించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హౌసింగ్ డీఈ వేణుగోపాల్ తెలిపారు.


