ఉట్నూర్‌రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అధికారులను ఆదేశించారు. శనివారం ఐటీడీఏ కార్యాలయంలో ఇంజనీరింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు చేరుకోలేని గ్రామాలను గుర్తించి, అక్కడి రోడ్ల మరమ్మతు పనులను చేపట్టాలని సూచించారు. ప్రజలకు అత్యవసర వైద్య సేవలు సకాలంలో అందేలా రవాణా సౌకర్యాలను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వేగవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యమన్నారు.
మాట్లాడుతున్న పీవో మంద మకరందు


