క్షణికావేశంలో ఆత్మహత్య
దహెగాం: మద్యం మత్తులో భార్యతో గొడవపడిన భర్త క్షణికావేశంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దహెగాం మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన నాయిని విష్ణు(25)కు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం బొప్పురం గ్రామానికి చెందిన సుమలతతో రెండేళ్ల క్రితం వివాహమైంది. కూలీ పనిచేసుకుని విష్ణు జీవనం సాగిస్తున్నాడు. రెండురోజుల క్రితం బొప్పురంలో జరిగిన వివాహానికి వచ్చాడు. కోటపల్లి మండలం మల్లంపేటలో శనివారం రిసెప్షన్‌కు భార్యతో కలిసి వెళ్లాడు. ఆదివారం తెల్లవారుజామున బొప్పురం చేరుకుని మద్యం మత్తులో భార్యతో గొడవపడ్డాడు. అనంతరం బహిర్బూమికని వెళ్లి గ్రామ సమీపంలోని ఎర్రచందనం తోటలో చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి తమ్ముడు నాయిని క్రిష్ణ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


