చెరిగిపోతున్న హద్దులు
‘వేలాల’ క్వారీలో కాంట్రాక్టర్ల కొత్త ఎత్తులు
నది లోపలే ఇసుక నింపుతూ రవాణా
లోడింగ్ చార్జీల పేరిట అనధికార వసూళ్లు
‘అదనపు బకెట్’ లేకున్నా నిర్వాహకులకు ఆదాయమే
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఇసుక రవాణాలో అధిక లోడ్ లేదంటూనే కాంట్రాక్టర్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. గతంలో ఓవర్ లోడ్.. అంటే అనుమతి కంటే ఎక్కువగా జేసీబీ బకెట్‌లతో లారీల్లో ఇసుక నింపి రోజుకు టన్నులకొద్దీ అదనంగా పంపి రూ.లక్షలు ఆర్జించేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రి వివేక్ ఆదేశాలతో చెన్నూర్ నియోజకవర్గంలో ఓవర్ లోడ్ పూర్తిగా లేకుండా పోయింది. దీంతో కాంట్రాక్టర్లకు గతంలో మాదిరి ఇసుక కాసుల వర్షం కురిపించడం లేదు. దీంతో వీలైనంతగా ఓవర్ లోడ్ లేకుండానే అక్రమ సంపాదనకు తెగబడుతున్నారు. పైకి అంతా సవ్యంగానే జరుగుతోందని చెబుతూనే రోజువారీగా భారీగానే సంపాదిస్తున్నారు. జైపూర్ మండలం వేలాల క్వారీ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మల్లన్నసాగర్ రిజర్వాయర్‌కు అనుమతి ఇచ్చారు. తర్వాత ప్రభుత్వ పనులకు వినియోగిస్తున్నారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ప్రజా, సామాజిక అభివృద్ధి పనుల్లో నిర్మాణాలకు ఆర్డర్ల మేరకు ఇసుక రవాణా చేయాలి.
నేరుగా నదిలోనే లారీల్లో నింపేస్తూ..
గోదావరి నుంచి వేలాల ఇసుక క్వారీలో లోలోపల గుట్టుగా కానిస్తున్నారు. రవాణా చేయాలంటే ముందుగా గుర్తించిన ఇసుక మేటలను గోదావరి ఒడ్డున డంప్ చేయాలి. ఆ తర్వాత స్టాక్ యార్డును ఆన్‌లైన్ నమోదు చేసి ఈ మేరకు ఆన్‌లైన్ ఆర్డర్ల ప్రకారం రవాణా జరగాలి. కానీ నేరుగా లారీని నదిలోకి దించి ఆపై రవాణా చేస్తున్నారు. ఇదంతా నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారు. గోదావరిలో నిర్ణయించిన హద్దు లోపల ఇసుక తోడి డంప్ చేసేందుకు కాంట్రాక్టర్‌కు రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ ఒక టన్నుకు రూ.72 చెల్లిస్తుంది. ఇందులో జీఎస్టీ కాంట్రాక్టర్ చెల్లించాలి. లోడింగ్ కోసం ప్రభుత్వం ఇచ్చే కమీషన్ కాకుండా ఒక్కొక్కరి నుంచి రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారు. మొదట రూ.1500 తీసుకుని మరో రూ.వెయ్యి వరకు పెంచారు. మొదట్లో కొంతమేరకు డంప్ చేసిన ఇసుక రోడ్డుకు సమీపంలోనే ఉంది. కానీ ప్రస్తుతం నేరుగా లారీ నుంచే ఇసుక తీసుకు వస్తున్నారు. అంటే సర్కారు ఇచ్చే కమీషన్ తీసుకుంటూ డంప్ చేయకుండానే లారీలతో తరలిస్తున్నారు. వాస్తవ కాంట్రాక్టు దక్కించుకున్న వారు రాష్ట్ర స్థాయిలో బడా రాజకీయ పలుకుబడి ఉన్న వారు కావడంతో తమకు తెలిసిన వారి చేతిలోనే ఈ క్వారీ నడుస్తోంది. వాళ్లు కూడా స్థానికంగా అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారు. వేలాల క్వారీ నిర్వాహకులు మున్సిపల్ ఎన్నికల్లో క్వారీ ఉన్న నియోజకవర్గ పరిధికి రూ.2కోట్ల వరకు ఖర్చు కోసం సర్దినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర సర్కారులో ఉన్న ప్రజాప్రతినిధి నుంచి తమకు పరోక్ష అండగా ఉన్నట్లుగా భావిస్తూ ఈ వ్యవహారమంతా నడుపుతున్నారు.
అక్రమాలకు పాల్పడితే
కఠిన చర్యలు
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా గట్టి నిఘా ఉంచాం. పట్టుబడిన వాహనాలపై జరిమానాలు విధిస్తూ ప్రభుత్వ ఖాతాలో జమ చేయిస్తున్నాం. వేలాల క్వారీ నదిలోనే లోడ్ చేస్తూ సరఫరా చేస్తున్న విషయంపై సంబంధింత అధికారులను అప్రమత్తం చేస్తాం.
– కుమార్ దీపక్, జిల్లా కలెక్టర్
పట్టుబడుతున్న వాహనాలు
జిల్లాలో చెన్నూరు మండలం చింతలపల్లి పట్టాలాండ్, చెన్నూరు బతుకమ్మవాగు, కోటపల్లి మండలం కొల్లూరు ముల్కల్ల పరిధిలో గోదావరి, సాండ్‌బజార్లు నడుస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పలు చోట్ల పక్కదారి పట్టిస్తున్నారు. పలువురు ట్రాక్టర్లలో నిబంధనలు ఉల్లంఘించి ఇసుక రవాణా చేయడంతో అధికారులు పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టరుకు రూ.25వేలు, లారీ పట్టుబడితే రూ.2లక్షల వరకు జరిమానా విధిస్తూ సుమారు రూ.20లక్షల వరకు వసూలు చేశారు. ఇటీవల జన్నారం మీదుగా ఉట్నూరు వైపు వెళ్తున్న ఇసుక లారీని ఇందన్‌పల్లి చెక్‌పోస్టు వద్ద అటవీ అధికారులు పట్టుకున్నారు. వేలాల క్వారీ నుంచి ఇసుక తీసుకెళ్తున్నట్లుగా నకిలీ బిల్లు సృష్టించి దొరికిపోయారు.
మొదట గోదావరి కింద అన్నారం బ్యారేజీ దిగువభాగంలో అయితే అధికారికంగా 20లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సాగునీటి ప్రాజెక్టుల కోసం అనుమతి ఇచ్చారు. అధికారికంగా 2లక్షల వరకు రవాణా చేసి, అనధికారికంగా దాదాపు 10లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఇసుక తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ నిల్వల కాలపరిమితి ముగిసిపోవడంతో గత జూన్‌లో మళ్లీ కొత్తగా 2.40లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చారు. గోదావరిలో కార్పొరేషన్ అనుమతించిన చోటు వరకే ఇసుక తోడి నదీ తీరంలో డంప్ చేయాలి. వానాకాలంలో నదిలో వచ్చిన వరద మట్టం, ఇసుక మేటలు గుర్తించిన చోటనే గరిష్ట అనుమతి ఉంటుంది. అయితే ఇసుకను నిర్ణీత లోతు కంటే అధికంగా తోడేస్తున్నారు. 2మీటర్ల లోతు వరకే ఇసుక తీయాలి. అంతకంటే ఎక్కువ లోతు తీస్తున్నారు. దీంతో వానాకాలంలో గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. భూగర్భ జలాలూ అడుగంటుతున్నాయి. ఇక పైన బ్యారేజీ నిర్మాణానికి దూరం వదలాల్సి ఉంది. జియో ట్యాగింగ్‌తో కూడిన హద్దులను ఎప్పటికప్పుడు టీజీఎండీసీ అధికారులు తనిఖీ చేయాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంతో ఇష్టారీతిన నదీలో తవ్వుతున్నారనే వాదనలు ఉన్నాయి.
చెరిగిపోతున్న హద్దులు
చెరిగిపోతున్న హద్దులు


