ప్రారంభానికి జాప్యమెందుకో..!
రూ.3.6కోట్లతో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ భవన నిర్మాణం
ఎంసీహెచ్‌లో తాత్కాలికంగా
కొనసాగుతున్న స్టోర్
భవనానికి ప్రహరీ లేక ఖరీదైన స్థలంపై కబ్జాదారుల కన్ను
నస్పూర్: జిల్లా కేంద్రంలోని నస్పూర్‌లో నిర్మించిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్ నూతన భవన ప్రారంభంలో జాప్యం జరుగుతోంది. నిర్మాణం పూర్తయి ఎనిమిది నెలలు కావస్తున్నా అధికారులు ఎందుకు ప్రారంభించడం లేదనే సందేహం తలెత్తుతోంది. నస్పూర్ శివారు సర్వేనంబరు 42లోని సుమారు 1.2 ఎకరాల ప్రభుత్వ భూమిలో రూ.3.6 కోట్లు నేషనల్ హెల్త్ స్కీం నిధులతో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ భవన నిర్మాణానికి గత ప్రభుత్వం నిర్ణయించి ఏర్పాట్లు చేసింది. అప్పటి మంత్రి హరీశ్‌రావు లక్సెట్టిపేట నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తయి ఎనిమిది నెలలు కావొస్తోంది. జిల్లా వ్యాప్తంగా అవసరమైన అన్ని మందులు ఇక్కడ నిల్వ చేయవచ్చు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గదిలో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి అవసరమైన ఆస్పత్రులకు మందులు సరఫరా చేస్తున్నారు. నూతన భవనాన్ని అందుబాటులోకి తెస్తే మంచిర్యాలలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)తోపాటు చెన్నూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లిలోని కమ్యూనిటీ హెల్త్‌సెంటర్(సీహెచ్‌సీ)లు, అన్ని మండలాల్లోని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, సబ్ సెంటర్లకు మందులు త్వరగా సరఫరా చేయవచ్చు.
ఖాళీ స్థలంపై కబ్జాదారుల కన్ను
సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌కు కేటాయించిన స్థలంలో అధికారులు భవన నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. ప్రహరీ నిర్మించకపోవడంతో చుట్టూ ఉన్న ఖరీదైన ఖాళీ స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది. గతంలో పలువురు ఆ స్థలాన్ని కబ్జాకు యత్నించగా రెవెన్యూ అధికారులు స్పందించి అడ్డుకున్నారు. ప్రహరీ నిర్మాణం చేపడితే కబ్జా యత్నాలు పునరావృత్తం కాకుండా ఉంటాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌ను త్వరగా ప్రారంభించాలని కోరుతున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల
మేరకు చర్యలు
నస్పూర్‌లోని సెంట్రల్ మెడిసిన్ స్టోర్ భవన నిర్మాణం పూర్తయ్యింది. మందుల నిల్వకు అవసరమైన ర్యాక్ సిస్టం రావాల్సి ఉంది. ఏర్పాటయ్యాక ఉన్నతాధికారులకు సమాచారం అందించి వారి ఆదేశాల మేరకు ప్రారంభానికి చర్యలు తీసుకుంటాం. భవన నిర్మాణానికి మాత్రమే నిధులు వచ్చాయి. ప్రహరీ నిర్మాణానికి నిధులు రాలేదు. నిధులు మంజూరైతే ప్రహరీ నిర్మిస్తాం.
– ముబీన్, ఏఈ, టీజీఎంఎస్‌ఐడీసీ


