ప్రతీ డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లను వారి ఇల్లు అనుకుని ప్రతీ వార్డు ఆఫీసర్, అధికారులు అభివృద్ధికి కృషి చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. మంచిర్యాల నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలో శనివారం కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, వార్డు ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లలో ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే పరిష్కారం చేసేలా వార్డు ఆఫీసర్లు పనిచేయాలని తెలిపారు. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సమస్యతోపాటు ఎలాంటి సమస్యలున్నా పరిష్కారంలో ముందుంటానని, ఇప్పటికే తాగునీటి సమస్య పరిష్కరించామని తెలిపారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, వీధి దీపాలపై నిత్యం దృష్టి సారించాలని, డివిజన్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన వస్తువులు, దుస్తులు అందించాలని కమిషనర్ అన్వేష్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, అధికారులు, వార్డు ఆఫీసర్లు, అధికారులు పాల్గొన్నారు.


