గడువు ముంచుకొస్తోంది..!
ఆస్తి పన్నుల వసూళ్లలో పంచాయతీల వెనుకంజ
30రోజుల్లో రూ.1.66 కోట్లు వసూలయ్యేనా..!
ఇప్పటివరకు రూ.4.89 కోట్లు వసూలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఆస్తి పన్నుల వసూళ్లకు గడువు ముంచుకొస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నుల వసూళ్లు వంద శాతం చేరడానికి మరో 30రోజులు మాత్రమే గడువు ఉంది. జిల్లాలోని 16మండలాల్లో 306 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గత ఏడాది బకాయిలతో కలిపి ఈ ఏడాది రూ.6,56,16,489 వసూలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు రూ.4,89,30,801 వసూలుతో 75శాతానికి చేరింది. మిగతా 25శాతం రూ.1,66,85,688 వసూలు చేయాల్సి ఉంది. మండలాల వారీగా పరిశీలిస్తే కాసిపేట 93శాతం, భీమారం 83, లక్సెట్టిపేట 82, భీమిని 81, కోటపల్లి, నెన్నెల, వేమనపల్లి 76, మందమర్రి 74, దండేపల్లి, కన్నెపల్లి 73, చెన్నూర్, జైపూర్ 72, బెల్లంపల్లి, తాండూరు, హాజీపూర్, జన్నారం 69శాతం పన్నులు వసూలు చేశాయి.
ఎన్నికల వేళ కాస్త మెరుగు
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆస్తి పన్నుల వసూళ్లతో పంచాయతీల ఖజానా కళకళలాడింది. సర్పంచులు, వార్డు సభ్యులతోపాటు బలపరిచే వారికి సంబంధించి ఆస్తిపన్నులు వసూలయ్యాయి. అయినా చాలావరకు పేరుకుపోయిన బకాయిలను మార్చి నెలాఖరు వరకు వసూలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామాల్లో పన్నుల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం, భారీ బకాయిదారులకు రెడ్ నోటీసులు ఇవ్వడంతోపాటు వసూళ్లు వేగవంతం చేసేలా అధికారులు నిత్యం సమీక్షిస్తున్నారు. ఏటా పన్నుల వసూళ్లలో ప్రథమ స్థానంలో నిలిచే జిల్లా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ స్థానంలో నిలుస్తుందో చూడాలి.
ఇంటి పన్నులే కీలకం..
టాక్స్‌లు, నాన్‌టాక్స్‌ల కింద గ్రామ పంచాయతీ వారీగా లక్ష్యాలను విధించుకుని అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చుకుంటారు. ప్రధానంగా ఇంటి పన్నులే కీలకం కాగా ఇళ్ల అనుమతులు, జరిమానాలు, తైబజార్ తదితర వాటి ద్వారా వచ్చే ఆదాయం, వ్యాపార సముదాయాలకు విధించే జరిమానాలు, పన్నులు తదితర వాటి ద్వారా సమకూరే నిధులను నాన్ టాక్స్‌ల కింద లెక్కిస్తారు. ఇంటి పన్నుల వసూళ్లలో పారదర్శకంగానే వ్యవహరిస్తున్నా నాన్‌టాక్స్‌ల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వ్యాపారులతో లోపాయికారిగా ఉంటూ వ్యాపార సముదాయాలకు పన్నుల విధింపు, వసూలులో ఆసక్తి చూపడం లేదని విమర్శలు ఉన్నాయి.
ఆదాయానికి గండి
పంచాయతీల్లోని ఆస్తులకు చాలా ఏళ్ల నుంచి అసెస్‌మెంటు చేయడం లేదు. గతంలో ఉన్న పన్నులు మాత్రమే వసూలు చేస్తున్నారు. ఒకప్పుడు రేకులు, గూనతో ఉన్న ఇళ్లు ఇప్పుడు భవనాలుగా మారాయి. పన్నుల డిమాండ్ పెరగడం లేదు. పాత ఇళ్లు, నిర్మాణాలు చేపట్టిన ఇళ్లకు సైతం ఎప్పటికప్పుడు అసెస్‌మెంటు చేయకపోవడంతో పంచాయతీలకు ఆదాయం రాకుండా పోతోంది. ప్రతీ ఇంటికి అసెస్‌మెంటు చేసి పన్నుల మదింపు చేస్తే ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు అదనంగా మరో 40శాతం వరకు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.


