ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్
● సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాలక్రైం: ప్రమాదాల నివారణ, ప్రజల భద్రతే లక్ష్యంగా అరైవ్–అలైవ్ రెండో విడత కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గురువారం రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రతీ వాహనదారుడు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు తెలిపారు. అధిక శాతం రోడ్డు ప్రమాదాలు మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారానే జరుగుతున్నాయని అన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించకపోవడం వల్ల ప్రమాదాల్లో తలకు బలమైన గాయమై మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాష్, స్థానిక సీఐ ప్రమోద్‌రావు, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.


