కో ‘ఆప్షన్ ఎవరికో’..!
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మున్సిపల్ పాలకవర్గాలు కొలువు దీరడంతో ఇప్పుడు అందరూ కో–ఆప్షన్ సభ్యత్వాలపై దృష్టి సారించారు. ఎన్నికల్లో పోటీ చేయని వారితోపాటు పార్టీలో సీనియర్లు, హామీలు పొందిన పలువురు ఆశావహులు కో–ఆప్షన్ పదవి దక్కించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 16న మంచిర్యాల నగర మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అదే రోజు కో–ఆప్షన్ సభ్యులుగా ఎంపిక కోసం పురపాలక శాఖ మార్గదర్శకాలు జారీ చేసి 60రోజుల్లోపు ఎంపిక పూర్తి చేయాలని సూచించింది. జిల్లాలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు చెన్నూర్, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, క్యాతనపల్లి మున్సిపాల్టీలు ఉన్నాయి. కార్పొరేషన్‌లో 6, ఒక్కో మున్సిపాల్టీలో నాలుగు చొప్పున 16 కో–ఆప్షన్ పదవులు ఆశావహులకు దక్కనున్నాయి. పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన సీనియర్లతోపాటు పలువురు ఆశావహులు ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కొందరికి కో–ఆప్షన్ పదవులు ఇస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో తమ టికెట్లు త్యాగం చేసిన వారు, పోటీ నుంచి విరమింపజేసిన వారు కూడా ఉన్నట్లు సమాచారం.
నగరంలో..
మంచిర్యాల నగర పాలక సంస్థలో ఆరు కో–ఆప్షన్ పదవులు ఉంటాయి. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆశావహులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. చాలావరకు ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వారికే పదవులు దక్కుతాయి. ఆరు కో–ఆప్షన్ సభ్యత్వాల్లో రెండు మైనార్టీలకు మిగతావి జనరల్‌కు కేటాయిస్తారు. ఇందులో కూడా 50శాతం మహిళలకు రిజర్వు చేస్తారు. జనరల్ కేటగిరీలో కో–ఆప్షన్ సభ్యత్వం దక్కాలంటే గతంలో ఐదేళ్లు ప్రజాప్రతినిధిగా పని చేసి ఉండాలి. అంటే చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, మాజీ కౌన్సిలర్, విలీన గ్రామాలు ఉంటే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుడిగా ఐదేళ్లు పని చేసిన వారై ఉంటేనే నామినేటెడ్ కోటా కింద కో–ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది.
బల్దియాల్లో నలుగురు చొప్పున
ఒక్కో మున్సిపాల్టీకి నలుగురు చొప్పున కో–ఆప్షన్ సభ్యులు ఉంటారు. కౌన్సిల్‌లో చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్, కౌన్సిలర్లుగా ఐదేళ్లకు తగ్గకుండా ప్రజాప్రతినిధిగా ఉండాలి. నాలుగు కో–ఆప్షన్ సభ్యత్వాల్లో మైనార్టీ వర్గానికి రెండు, జనరల్ కేటగిరీలో రెండు కేటాయిస్తే ఇందులో రెండు మహిళలకు రిజర్వు చేస్తారు. ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ వర్గాలకు చెందిన వారు, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళలు, పురపాలనలో అనుభవం, నైపుణ్యం కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లేదా పట్టణ ప్రణాళిక విభాగంలో పని చేసి గెజిటెడ్ అధికారి హోదాలో రిటైర్డు అయిన ఉద్యోగులు కో–ఆప్షన్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లోని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా ఐదేళ్లు పని చేసిన వారూ అర్హులే అవుతారు.
సమాన హోదా
ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్, కౌన్సిలర్‌తో సమాన హోదా కో–ఆప్షన్ సభ్యులకు ఉంటుంది. కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉండడంతో ఈ పదవికి డిమాండ్ ఏర్పడింది. పాలకవర్గం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు. పాలన, సమస్యలపై చర్చించే వీలుంటుంది. కానీ అభివృద్ధి పనులు తీర్మానంలో వీరి పాత్ర ఉండదు. సభ్యులు వరుసగా మూడు సమావేశాలకు హాజరు కాని పక్షంలో సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంటుంది. గౌరవ వేతనం కూడా ఉంటుంది. మొత్తంగా కో–ఆప్షన్ పదవి దక్కాలంటే కౌన్సిల్ ఓటరు జాబితాలో ఓటు హక్కు కలిగి ఉండి 21సంవత్సరాలు దాటిన వారు అర్హులు అవుతారు.


