పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం
నస్పూర్: త్వరలో జరిగే గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా, డీసీపీ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాస్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావుతో కలిసి గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ, పోలీస్, రెవెన్యూ, వైద్య, విద్యుత్, మత్స్య, నీటి పారుదల శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాలు దక్షిణాది కుంభమేళా తరహా సాగుతాయని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. గోదావరి నది పరీవాహకంలో అనువైన చోట్ల పుష్కరఘాట్ల ఏర్పాట్లకు కార్యాచరణ సిద్ధం చేయాలని అన్నారు. మంచిర్యాల పట్టణం, గూడెం గోదావరి తీరంలో భక్తులు అధిక సంఖ్యలో పుష్కర స్నానాలు ఆచరించే అవకాశం ఉందని చెప్పారు. పార్కింగ్, హోల్డింగ్ ఏరియా, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారవాణా, డ్రోన్‌ల ద్వారా పర్యవేక్షణ, లైటింగ్, తాగునీరు ఏర్పాట్లపై ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.
వనదేవతలను కొలిచే ఆచారం
నస్పూర్: రాష్ట్రంలో వన దేవతలను కొలిచే ఆచారం ప్రసిద్ధి పొందిందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం ఆయన కలెక్టర్ చాంబర్‌లో గాంధారి ఖిల్లా చరిత్ర భాగం–1 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయక్‌పోడ్ సేవా సంఘం ప్రతినిధి పల్ల సత్యనారాయణ, పుస్తక రచయిత మేసినేని రాజన్న, నాయక్‌పోడ్ హక్కుల పరిరక్షణ కమిటీ ప్రతినిధి గంజి రాజన్న, జిల్లా ప్రతినిధి పెద్ది రాజన్న, గాంధారి మైసమ్మ ఆలయ కమిటీ ప్రతినిధి దైనేని రమేశ్ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
నస్పూర్: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, రోడ్లు, భవనాలు, ఆర్టీసీ, విద్యుత్, పంచాయతీ రాజ్, మున్సిపల్ కమిషనర్లతో రోడ్డు ప్రమాదాల నివారణపై రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రోడ్లపై చెత్త ఆటంకాలను తొలగించాలని అన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.


