ఫర్నిచర్‌ తరలిస్తున్న లారీ పట్టివేత | - | Sakshi
Sakshi News home page

ఫర్నిచర్‌ తరలిస్తున్న లారీ పట్టివేత

Feb 21 2026 6:55 AM | Updated on Feb 21 2026 6:55 AM

ఫర్ని

ఫర్నిచర్‌ తరలిస్తున్న లారీ పట్టివేత

జన్నారం: అక్రమంగా ఫర్నిచర్‌ తరలిస్తున్న లారీని పట్టుకుని సీజ్‌ చేసినట్లు తాళ్లపేట రేంజ్‌ అధికారి సుష్మారావు తెలిపారు. గురువారం రాత్రి జన్నారం నుంచి తాళ్లపేట్‌ వైపు వెళ్తున్న లారీని తపాలాపూర్‌ చెక్‌పోస్టు వద్ద బీట్‌ అధికారి జ్యోతి తనిఖీ చేశారు. అందులో ఫర్నిచర్‌ కనిపించడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సెక్షన్‌ అధికారి శంకర్‌, బీట్‌ అధికారులు సాయి, కృష్ణమూర్తి, బేస్‌క్యాంపు సిబ్బంది పట్టుకున్న లారీని రేంజ్‌ కార్యాలయానికి తరలించారు. ఈమేరకు విచారణ చేస్తున్నట్లు ఎఫ్‌ఆర్వో తెలిపారు.

7.5 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం..

ఆదిలాబాద్‌టౌన్‌: ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 7.5 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని శుక్రవారం వన్‌టౌన్‌ పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని చిల్కూరిలక్ష్మినగర్‌కు చెందిన షేక్‌ ఇమ్రాన్‌ అహ్మద్‌ మహారాష్ట్రకు చెందిన సాహూకు బియ్యాన్ని విక్రయించేందుకు ఆటోలో తరలిస్తున్నాడు. వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొలిపూర ప్రాంతంలో ఆటో తనిఖీ చేసి బియ్యాన్ని పట్టుకున్నట్లు సీఐ బి.సునీల్‌కుమార్‌ తెలిపారు. ఆటో సీజ్‌ చేయడంతోపాటు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఖానాపూర్‌: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పెంబి ఎస్సై హన్మాండ్లు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని బావాపూర్‌(ఆర్‌) తండా పంచాయతీ పరిధిలోని పంగిడిగూడెంకు చెందిన తొడసం మారుతి(40) మానసిక స్థితి సరిగా లేదు. మద్యానికి బానిసయ్యాడు. తాగిన మత్తులో ఈనెల 17న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య సునీత, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

స్తంభాన్ని ఢీకొట్టిన కారు

భైంసారూరల్‌: మండలంలోని సుంక్లి గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. కారులో ఒక్కసారిగా ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మండలంలోని వానల్‌పాడ్‌ నుంచి సుంక్లి గ్రామానికి సాయారెడ్డి, శ్రీనివాస్‌ కారులో వెళ్తున్నారు. శుక్రవారం పోచమ్మ ఆలయం వద్ద అదుపుతప్పి స్తంభానికి, రోడ్డుపక్కన నిలిపి ఉంచిన స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. కారు, స్కూటీ దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య

భైంసారూరల్‌: ఉరివేసుకుని ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సుప్రియ తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. మండలంలోని వాడి గ్రామానికి చెందిన కల్యాణ్‌ సంతోశ్‌(44), గీతాబాయి దంపతులు. భర్త కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పిల్లలు పుట్టడం లేదని కల్యాణ్‌ సంతోష్‌ మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో గురువారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. శుక్రవారం కుటుంబీకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఫర్నిచర్‌ తరలిస్తున్న లారీ పట్టివేత1
1/2

ఫర్నిచర్‌ తరలిస్తున్న లారీ పట్టివేత

ఫర్నిచర్‌ తరలిస్తున్న లారీ పట్టివేత2
2/2

ఫర్నిచర్‌ తరలిస్తున్న లారీ పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement