జాతరెళ్తున్నారా.. జాగ్రత్త!
మొదలైన సమ్మక్క మొక్కులు రద్దీ ప్రాంతాల్లో అటెన్షన్ డైవర్షన్ ముఠాలు బస్టాండ్, బ్యాంకులు, తాళం వేసిన ఇళ్లే టార్గెట్ అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక
మంచిర్యాలక్రైం: సమ్మక్క, సారలమ్మ జాతర వేళ ప్రజలు నాలుగు రోజుల పాటు మేడారం వెళ్తుంటా రు. ఇదే అదనుగా భావించిన దొంగల ముఠా తా ళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తోంది. పట్టణ ప్రధాన కేంద్రాల్లో, పల్లెల్లో బస్టాండ్, బ్యాంకుల వద్ద ప్రజ లు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కాపు కాసుకుని ఉన్న ‘అటెన్షన్ డైవర్షన్’ ముఠాలు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీ, హరియాణా, యూపీ, బిహార్ రా ష్ట్రాలకు చెందిన పార్థి గ్యాంగ్, చెడ్డి గ్యాంగ్ ముఠాగా ఏర్పడి చోరీలు, దారి దోపిడీలకు పాల్పడుతుంటారు. ముఠా సభ్యుల్లో కొందరు రాత్రి, మరికొందరు పగలు రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లలో రాత్రి చోరీలకు పాల్పడుతారు. జనసంచారం ఉండే ప్రాంతాల్లో ప్రజల్లో కలిసిపోయి మాయచేసి రెప్పపాటు సమయంలో సొత్తు మాయం చేస్తారు. చైన్ స్నాచింగ్, పర్స్‌లు, సెల్‌ఫోన్లు, బ్యాగులు కొట్టేసేందుకు యత్నిస్తుంటారు. ఏటీఎం సెంటర్‌కు వచ్చే వృద్ధులు, నిరక్షరాస్యులు, అమాయకులకు మాయమాటలు చెప్పి బురిడీ కొట్టిస్తారు. ఈ నెల 28, 29, 30, 31 తేదీలలో సమ్మక్క జాతర నేపథ్యంలో మేడారం వెళ్లే భక్తులు బంగారు ఆభరణాలు, నగదు, ఇతర విలువైన సామగ్రి ఇంట్లో ఉంచకుండా తెలిసినవారి ఇంట్లో లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని, ప్రతిఒక్కరూ తమ ఇంటి వద్ద ఎల్‌హెచ్‌ఎస్(లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం) ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
నిఘా నీడలో జాతర...
మంచిర్యాలలో సమ్మక్క, సారలమ్మ జాతర పూర్తిస్థాయిలో నిఘా నీడలో జరుగుతోంది. 20 అధునాతనమైన సీసీ కెమెరాలు, వెయ్యి మంది భద్రత సిబ్బంది, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఓ పోలీస్ అధికారి మానిటరింగ్ చేయనున్నారు.
విలువైన వస్తువులు ఇంట్లో ఉంచవద్దు
జాతరకు వెళ్లే వారు బంగారు అభరణాలు, విలువైన వస్తువులు, నగదు ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. ప్రయాణాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే పానీయాలు, ఆహారం తీసుకోవద్దు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే డయల్ 100 లేదా జాతర సమీపంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో ఫిర్యాదు చేయాలి.
– అంబర్ కిషోర్‌ఝా,
రామగుండం పోలీస్ కమిషనర్
జాతరెళ్తున్నారా.. జాగ్రత్త!


