ఇక పక్కా వాతావరణ సమాచారం
బెల్లంపల్లి: వాతావరణ పరిస్థితులను రోజువారీగా రైతులు, ప్రజలకు అందించడం కోసం బెల్లంపల్లి కేంద్రంగా ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఏర్పాటు చేశారు. కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ఆవరణలో రూ.10లక్షల వ్యయంతో ఇటీవల నెలకొల్పారు. ప్రయోగాత్మకంగా వాతావరణ పరిస్థితుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేంద్రాన్ని మరికొద్ది రోజుల్లో అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో వాతావరణ కేంద్రం లేకపోవడంతో జగిత్యాలలోని జోనల్ స్థాయి వాతావరణ కేంద్రం నుంచి వారానికోసారి నమోదైన ఉష్ణోగ్రతలు, వర్షపాతం, గాలిలో తేమ శాతం వంటి వివరాలు కృషి విజ్ఞాన కేంద్రానికి పంపిస్తున్నారు. ఆ వివరాల ఆధారంగా కేవీకే శాస్త్రవేత్తలు పంటలు సాగు చేస్తున్న రైతులకు వివరించి అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కోసారి వాతావరణ సమాచారం భిన్నంగా ఉంటుండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అలా ప్రతికూల పరిస్థితులు ఏర్పడకుండా ఉండడానికి కేవీకేలో వాతావరణ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ కేంద్రం పరిధిలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గరిష్టం 80 నుంచి 90శాతం వరకు కచ్చితత్వంతో కూడిన వాతావరణ సమాచారం తెలుసుకునే సౌకర్యం ఏర్పడింది. జిల్లాలో వాతావరణ కేంద్రం అందుబాటులోకి రావడంతో రైతులు, ప్రజలు వాతావరణం వివరాలు మరింత వేగవంతంగా ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుందని కేవీకే శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


