బల్దియా ఎన్నికలకు కసరత్తు
చెన్నూర్: రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చే సింది. దీంతో అధికారులు ఎన్నికల సామగ్రి సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే అన్ని సిద్ధం చేసుకోవాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
యంత్రాంగం సన్నద్ధం
చెన్నూర్ మున్సిపాలిటీకి 2019 జనాభా ఓటరు జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించారు. ఈసారి 2026 ఓటరు జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పెరిగిన కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. 2019లో చెన్నూర్ మున్సిపాలిటీ జనాభా 23,579 ఉండగా 17,601 మంది ఓటర్లున్నారు. ఓటరు జాబితా ప్రకారం మున్సిపాలిటీని 18 వార్డులుగా విభజించి ఎన్నికలు నిర్వహించారు. గత పాలకవర్గ పదవీ కాలం 2024 జనవరిలో ముగిసింది. పాత పాలకవర్గం పదవీ కాలం ముగిసి ఏడాది కావడంతో 2026లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది.


