క్యాన్సర్‌పై సమరం!
మంచిర్యాలటౌన్: క్యాన్సర్‌పై సమరానికి వైద్యశాఖ చర్యలు చేపట్టింది. 14 ఏళ్లున్న బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు ఎక్కువగా గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్‌కు గురవుతుంటారు. కొందరు ఇదే క్యాన్సర్‌తో మృతి చెందిన ఘటనలున్నాయి. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యసిబ్బందికి ఈ నెల 12న అవగాహన కల్పించింది. ప్రభుత్వం వచ్చే నెలలోనే వ్యాక్సిన్ వేసేందుకు అవకాశం ఉండగా, ప్రస్తుతం 14 ఏళ్లున్న బాలికలు ఎంతమంది జిల్లాలో ఉన్నారనే వివరాలు సేకరిస్తోంది. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ రికార్డుల ప్రకారం 13–19 ఏళ్లున్న కౌమారదశ బాలికలు 25,628 మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 14ఏళ్లు నిండిన ప్రతీ బాలికకు వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇవ్వనుండగా, వచ్చే నెలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిసింది.
కొనసాగుతున్న బాలికల గుర్తింపు
జిల్లాలో 14ఏళ్లున్న బాలికలు ఎంతమంది ఉన్నారనే దానిపై విద్యాశాఖతో పాటు జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ ద్వారా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు వివరాలు సేకరించారు. ప్రస్తుతం 14ఏళ్లున్న వారు 8,084 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికీ ఇంకా గుర్తింపు కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ప్రస్తుతం 14–15 ఏళ్లున్న బాలికలకు ముందుగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. అనంతరం మిగతావారికి వ్యాక్సిన్‌ను విడతల వారీగా ఇవ్వనున్నారు. వ్యాక్సిన్‌తో పాటు వారికి క్యాన్సర్ ఏవిధంగా సోకుతుంది.. దాని కోసం వ్యాక్సిన్ వేస్తే ఎలా పనిచేస్తుందో వివరించనున్నారు.
ఎక్కువ మందిలో సర్వైకల్ క్యాన్సర్
ఆడవారికి వచ్చే క్యాన్సర్లలో ఎక్కువగా రొమ్ము, సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇందులో సర్వైకల్ క్యాన్సర్‌కు సంబంధించి సరైన అవగాహన లేకనే వ్యాధికి గురవుతున్నట్లు తెలుస్తోంది. కిశోర బాలికల్లో హార్మోన్ల మార్పులు జరుగుతున్న సమయంలోనే ఇన్‌ఫెక్షన్లు వచ్చి క్యాన్సర్‌గా మారేందుకు అవకాశముందని గుర్తించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది మూత్ర విసర్జన అనంతరం శుభ్రత పాటించక పోవడంతో వచ్చే అవకాశముంది. క్యాన్సర్ వచ్చిందని గుర్తించడంలోనూ జరుగుతున్న జాప్యంతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చదువుకునే బాలికలకే కాకుండా, చదువుకు దూరంగా ఉన్నవారినీ గుర్తించి వ్యాక్సిన్ వేయాలని, అప్పుడే సర్వైకల్ క్యాన్సర్ పూర్తిగా రాకుండా నిరోధించేందుకు అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది.


