మహాపూజ ప్రచారయాత్ర ప్రారంభం
ఇంద్రవెల్లి: పుష్యమాస అమవాస్యను పురస్కరించుకుని జనవరి 18న మహాపూజతో ప్రారంభించనున్న ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతరకు మెస్రం వంశీయులు శ్రీకారం చుట్టారు. సోమవారం రాత్రి నెలవంక చూసి మొక్కుకున్న తర్వాత మంగళవారం ఉమ్మడి జిల్లా మెస్రం వంశీయులు కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా మురాడి వద్దకు చేరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్ సమక్షంలో ప్రచార రథం నిర్వహణపై చర్చించారు. అనంతరం కటోడ మెస్రం హనుమంత్‌రావ్, పర్ధాన్ మెస్రం దాదారావ్ ఆధ్వర్యంలో ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఏడురోజుల పాటు మెస్రం వంశీయులున్న గ్రామాలను సందర్శించి ఈ నెల 30నుంచి నిర్వహించనున్న గంగాజల పాదయాత్రతో పాటు జనవరి 18న నిర్వహించనున్న నాగోబా మహాపూజ, జాతర నిర్వహణపై ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. మొదటిరోజు ఈ నెల 23న ముందుగా సిరికొండ మండలకేంద్రంలోని కుమ్మరి స్వామి వద్ద మహాపూజకు అవసరమయ్యే మట్టి కుండల తయారీకి ఆదేశాలిచ్చారు. అక్కడి నుంచి సిరికొండ మండలంలోని రాజన్‌పేట్ గ్రామానికి చేరుకుని మెస్రం వంశీయుల వద్ద బస చేశారు. ఈ నెల 24న గుడిహత్నూర్ మండలంలోని సోయంగూడ, 25న ఇంద్రవెల్లి మండలంలోని గిన్నేర, 26న ఉట్నూర్ మండలంలోని సాలేవాడ, 27న ఇంద్రవెల్లి మండలంలోని పొల్లుగూడ, 28న ఇంద్రవెల్లి మండలంలోని వడగామ్ గ్రామాల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో 29న కేస్లాపూర్ గ్రామానికి చేరుకుని మడావి వంశం ఇంట్లో బస చేయనున్నారు. 30న ఉదయం కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా మురాడి వద్దకు చేరుతారు. అదేరోజు ఉమ్మడి జిల్లా మెస్రం వంశీయులు కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా మురాడి వద్దకు చేరి సమావేశమై పవిత్ర గంగాజలం సేకరణ రూట్‌మ్యాప్‌పై చర్చిస్తారు. అనంతరం ప్రత్యేక పూజల మధ్య గంగాజల పాదయాత్రను ప్రారంభించనున్నట్లు నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్ తెలిపారు. జన్నారం మండలంలోని గోదావరి హస్తిన మడుగు నుంచి సేకరించి తీసుకువచ్చిన పవిత్ర గంగాజలంతో పుష్యమాస అమవాస్యను పురస్కరించుకుని జనవరి 18న మెస్రం వంశీయుల మహాపూజతో నాగోబా జాతర ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మెస్రం వంశ పెద్దలు మెస్రం చిన్నుపటేల్, మెస్రం బాధిరావ్, కటోడ హనుమంత్‌రావ్, మెస్రం కోసేరావ్, సర్పంచ్ మెస్రం తుకారాం, మెస్రం దాదారావ్, మెస్రం తిరుపతి, మెస్రం వంశ ఉద్యోగులు మెస్రం దేవ్‌రావ్, మెస్రం శేఖర్‌బాబు, సోనేరావ్ తదితరులున్నారు.
మహాపూజ ప్రచారయాత్ర ప్రారంభం


