మాతాశిశు మరణాలు లేకుండా చూడాలి
● రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుధీర
మంచిర్యాలటౌన్/బెల్లంపల్లి: జిల్లాలో మాతాశిశు మరణాలు లేకుండా చూడాలని, ఇందుకోసం ప్ర త్యేక వైద్య నిపుణుల సేవలు అందుబాటులో ఉంచాలని, ఎస్‌ఎన్‌సీయూ ద్వారా శిశువులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖజా యింట్ డైరెక్టర్ డాక్టర్ సుధీర అన్నారు. వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం జాయింట్ డైరెక్టర్ సుధీర, జాతీయ ఆరోగ్య మిషన్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ, వైద్యులు శిల్పారెడ్డి, విక్రమ్, మనోజ్‌లతో కలిసి బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రి, కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, యాపల్ ఉప కేంద్రం, మంచిర్యాలలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. రోగులు, గర్భిణులకు అందిస్తున్న సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ సుధీర మాట్లాడుతూ జిల్లాలో మాతాశిశు సంరక్షణలో భాగంగా వంద శాతం గర్భిణుల నమోదు, ఐరిస్‌తో గుర్తింపు, ప్రసవమయ్యే ఆస్పత్రి వివరాలు తెలియజేయాలని సూచించారు. సాధారణ ప్రసవాలు చేపట్టి శస్త్రచికిత్సలు తగ్గించాలని, గర్భిణుల వివరాలు పోర్టల్‌లో నమోదు చేయాలని అన్నారు. గర్భిణులకు కాన్పు ఆలస్యమైతే ఆ విషయాన్ని రోగులు, హెల్ప్‌డెస్క్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని ఆదేశించారు. డీఎంహెచ్‌వో అనిత, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్ ఆర్‌ఎంవోలు భీష్మ, ప్రసాద్, శ్రీధర్, ప్రోగ్రాం ఆఫీసర్లు అరుణశ్రీ, సుధాకర్‌నాయక్, నాగవేణి, శ్రీధర్, రవి, దివ్య పాల్గొన్నారు.


