
24 గంటల్లోనే దొంగ పట్టివేత
● వివరాలు వెల్లడించిన ఏసీపీ రవికుమార్
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గద్దెరాగిడి పద్మావతికాలనీలో భారీ చోరీకి పాల్పడిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. సీసీపుటేజీ ఆధారంగా 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. భూపాలపల్లిలో ఉంటున్న సింగరేణి కార్మికుడు మేకల రాజయ్య గద్దెరాగిడిలో నూతనంగా ఇల్లు నిర్మించాడు. శుక్రవారం కొత్తింట్లో వరలక్ష్మీ వ్రతం చేశారు. కుటుంబసభ్యులు, బంధువులు రాత్రి నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజామున రాజయ్య లేచి చూసేసరికి ఇంట్లోని బ్యాగులు చిందరవందరగా పడి ఉన్నాయి. బ్యాగులో దాచిన దాదాపు 40 తులాల బంగారు ఆభరణాలు, ఓ సెల్‌ఫోన్ చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీపుటేజీలో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి పలుచోట్ల కనిపించడంతో పాత నేరస్థుడు జాడి సురేష్‌గా గుర్తించారు. ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసింది తానేనని ఒప్పుకోవడంతో బంగారు ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాలలోని రాజీవ్‌నగర్‌కు చెందిన సురేష్‌పై గతంలోనూ పలు చోరీ కేసులున్నాయని, ముఖ్యంగా శుభకార్యాలు జరిగే ఇళ్లపై ఎక్కువగా దృష్టి సారిస్తాడన్నారు. నిందితుడిని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో పట్టణ ఎస్సై రాజశేఖర్, మందమర్రి ఎస్సై రాజశేఖర్ పాల్గొన్నారు. దొంగను పట్టుకోవటంలో చాకచక్యంగా వ్యవహరించిన పలువురు పోలీసులకు ఏసీపీ రివార్డులను అందించారు.