
ఆదివాసీలకు అధికారుల కౌన్సెలింగ్
జన్నారం: అడవిలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న జైనూర్, సిర్పూర్ మండలాలకు చెందిన పలువురు ఆదివాసీ గిరిజనులకు ఆదివారం అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇందన్‌పల్లి రేంజ్ అధికారి శ్రీధరచారితో పాటు లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై అనూష, దండెపల్లి ఎస్సై తహసీనొద్దీన్, డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్ ఇందన్‌పల్లి అటవీ రేంజ్, కవ్వాల్ అటవీ సెక్షన్, సొనాపూర్ బీట్ పాలఘోరి ప్రాంతానికి వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. అటవీభూమిలో నివాసం ఉండటం చట్టవిరుద్ధమని, ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సీఐ సూచించారు. అయితే పూర్వీకుల నుంచి ఈ భూమి మాదే అని కాగితాలున్నాయని, అందుకే నివాసం ఉంటున్నామని వారు పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్, ఐటీడీఏ పీవో, తహసీల్దార్‌కు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు ఆదివాసీలు పేర్కొన్నారు.